కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి 39వ సమావేశం మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటు 18 శాతానికి పెంచారు. ఈ నిర్ణయం మొబైల్స్ మార్కెట్ కు, దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిళ్లుతుందని మొబైల్ పరిశ్రమ వర్గాలంటున్నాయి.
మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటును 12 నుంచి 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవడంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పన్ను రేటు పెంచడంతో దేశీయ మార్కెట్‌లో మొబైల్ ఫోన్ల ధరలు పెరుగుతాయని, మేక్ ఇన్ ఇండియాపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నాయి.
పన్ను రేటు 12 నుంచి 18 శాతం పెంపు డిజిటల్ ఇండియాకు హానికర నిర్ణయంగా ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ పంకజ్ మహీంద్రూ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో దేశీయంగా మొబైల్ ఫోన్ల వినియోగం తగ్గిపోతుంది.
‘ దేశీయ వినియోగంతో 2025 నాటికి 80 బిలియన్ డాలర్లు (6 లక్షల కోట్లు) సాధించాలన్న మా లక్ష్యమూ నెరవేరదు. కనీసం రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం తగ్గుతుంది’ అని పంకజ్ మహీంద్రా పేర్కొన్నారు.
నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2019 కింద ప్రభుత్వం తమకు రూ.26 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ తయారీ వ్యవస్థను 2025 కల్లా రూపొందించాలని లక్ష్యంగా పెట్టిన విషయాన్ని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ పంకజ్ మహీంద్రూ గుర్తు చేశారు. ఇందులో ఒక బిలియన్ మొబైళ్లు తయారీతో .. రూ.13 లక్షల కోట్ల (రూ.5 లక్షల కోట్లు దేశీయంగా, రూ.7 లక్షల కోట్ల ఎగుమతులు) విలువైన వ్యవస్థను తయారు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.
కరోనావల్ల తీవ్ర ఎలక్ట్రానిక్ సంక్షోభం ఉన్న సమయంలో ధరల పెంపు వల్ల ఒక సెక్షన్ యూజర్లు సెకండ్ హ్యాండ్ గానీ బ్లాక్ మార్కెట్‌వైపు గానీ మొగ్గు చూపుతారని కౌంటర్‌పాయింట్ రీసర్చ్ అసోసియేషన్ డైరెక్టర్ తరణ్ పతక్ అన్నారు.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ కూడా మొబైల్ ఫోన్లను 18 శాతం జీఎస్టీ శ్లాబుల్లోకి చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల "మేక్ ఇన్ ఇండియా" పథకంపై ప్రతికూల ప్రభావం పడుతుందని షియోమీ ఇండియా ఎండీ మనూ జైన్ అన్నారు. కనీసం 200 డాలర్ల కన్నా తక్కువ విలువైన ఫోన్లకైనా 18 శాతం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.