భారతదేశంలో ఎంపీల జీతం పెంపు దుమారం రేపుతోంది. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న ఈ సమయంలో సామాన్యుల కష్టాలను పట్టించుకోనట్టు ఉంది.
24శాతం పెరుగుదల: దేశంలో ఇప్పటికీ చాలామందికి కనీస వేతనాలు దక్కడం లేదు. సంక్షేమ హాస్టళ్లలో పిల్లల భోజనానికి రోజుకి పది రూపాయలే ఖర్చు చేస్తున్నారు. పేదలు, ధనికుల మధ్య అంతరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గౌరవ వేతనం పెంచాలని రాత్రింబవళ్లు నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ రకరకాల సౌకర్యాలు అనుభవిస్తున్న, భారీగా జీతభత్యాలు తీసుకుంటున్న ఎంపీల జీతం, అలవెన్సులు, పెన్షన్లు విపరీతంగా పెంచేసుకున్నారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగానే ఈ పెంపుదల చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఈ పెంపుదల వార్త సామాన్య ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఎందుకంటే దేశంలో ఆర్థిక అసమానతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎంపీల సౌకర్యాలు పెరుగుతుంటే, సాధారణ కార్మికులు, శ్రామికులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతి దానికి వ్యతిరేకించే ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ ఒక్క పార్టీ కూడా ఈ జీతం పెంపును వ్యతిరేకించలేదు. ఇది రాజకీయ వర్గాల ఉమ్మడి స్వార్థాన్ని చూపిస్తుంది.
ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నారు!
ఒకవైపు ఎంపీల జీతాలు, సౌకర్యాలు పెరుగుతుంటే, సాధారణ కార్మికులు, కష్టపడి పనిచేసే ప్రజల ఆదాయం మాత్రం పెరగడం లేదు. కార్మికుల కనీస వేతనంలో కూడా చెప్పుకోదగ్గ పెరుగుదల లేదు. ప్రస్తుత ధరల పెరుగుదల పరిస్థితుల్లో రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి పోరాడుతున్నారు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కనీస ఆహార పదార్థాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులకు జీవనం గడపడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీల జీతం పెంపుదల ఈ సమస్యను పట్టించుకోనట్టుగా ఉంది.
నిరుద్యోగ సమస్య: దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది, ముఖ్యంగా యువతలో. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం నుంచి సరైన చర్యలు కనిపించడం లేదు. కానీ, ఎంపీల సౌకర్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో సామాన్యుల జీవన ప్రమాణాలు పడిపోతున్నప్పుడు ఎంపీల జీతం పెంపు అవసరమా? అని ఏ ప్రతిపక్షాలు నిరసనలు చేయకపోవడం ఆశ్చర్యకరమని దేశ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక అసమానత: ఎంపీల జీతం, సౌకర్యాల పెంపు దేశంలో ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేస్తోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. కానీ, సామాన్యుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎంపీల జీతం పెంపు నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, 'ఎంపీల జీతం పెరుగుతోంది, కానీ సామాన్యుల ఆదాయం తగ్గుతోంది' అని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక విధానాల ప్రాధాన్యతలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే బదులు రాజకీయ నాయకుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలైంది.
దీనిపై సోషల్ మీడియాలో ప్రజలు తమ ఆక్రోషాన్ని వెల్లగక్కుతున్నారు. 'దేశ జీడీపీ ఎంపీల జేబుల్లో పెరుగుతోందా?' అని కొందరు ప్రశ్నించారు. మొత్తానికి ఎంపీల జీతం, అలవెన్సులు, పెన్షన్ పెంపుదల నిర్ణయం భారతదేశంలో ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. సామాన్యులు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు రాజకీయ నాయకుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సబబు? ఈ నేపథ్యంలో ప్రభుత్వం సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా దృష్టి సారించడం అవసరం.