బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’’ కథలు : పార్ట్ -3

By Siva Kodati  |  First Published Feb 26, 2023, 5:54 PM IST

మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం 2022 కు ఎగుమామిడి అయోధ్య రెడ్డి కథా సంపుటి ' అక్కన్నపేట రైల్వే స్టేషన్ '  ఎంపికయింది.  ఈ సందర్భంగా అయోధ్య రెడ్డి కథలపై డా. సిద్దెంకి యాదగిరి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి:


- డా. సిద్దెంకి యాదగిరి

          (   నిన్నటి తరువాయి భాగం )

Latest Videos

undefined

‘జీవితంలో మళ్లీ ఆమెను చూస్తాననుకోలేదు...’ అనే వాక్యంతో మొదలైన కథ ‘ఆమెలోని నది’. చివరిదాకా చదివిస్తుంది. మళ్లా కాంట్రవర్సీ....! ఎవరో ప్రత్యర్థుల మధ్యకాదు. భార్యాభర్తల నడుమ. ఎంతొద్దనుకున్నా వాగ్వాదం.’ అంటే కథలోకి పాఠకున్ని అతి సునాయసంగా తీసుకెళతాడు. ‘ఆ లాడ్జితీరును గమనిస్తే అందులోకి వచ్చే వాళ్వెరూ ఇష్టపూర్వకంగా వస్తారని చెప్పడానికి వీల్లేకుండా ఉంది.’ అని ‘వెంటాడిన రాత్రి’ కథ ప్రారంభమవుతుంది.

గంతనే  గా శిన్నమాటకే సంజీవరావు దొరక్కోపమొచ్చింది. మొకమంతా ఎర్రంగ జేస్కొని కండ్లళ్ల నుంచి నిప్కలు గుమ్మరిచ్చిండు అనే ‘గాలివాన’ కథ ఎత్తుగడను చదివితే ఓ పట్టాన మనసూరుకోదు. ఆ పఠనం అలాగే కొనసాగుతుంది. 

‘‘పులి తరుముకొస్తున్న వాడు తాను ఎక్కదలుచుకొన్న చెట్టు దగ్గరకి ఎలా పరిగెడతాడో, అలా కథకుడు సూటిగా తన కథాంశం వద్దకు పరిగెట్టాలి’’ - HG wells అంటాడు. (కథాశిల్పం. ప్ర. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, హై.1995, వెంకటసుబ్బయ్య, వల్లంపాటి) చాలా స్పష్టంగా ఏది ఎంతవరకు చెప్పాలో తెలిసిన రచయిత గనుక ప్రతీ కథను అనుభూతి ఐక్యతతో అద్భుతమైన కథన శిల్పాన్ని పండించాడు.

అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ కథలలో విషాదాంతం ఎందుకు?:

ఈ కథా సంపుటిలో విషాదాంత కథలూ ఉన్నాయి. వాస్తవమెప్పుడూ వాస్తవమే. చెడు ప్రారంభం జీవితానికి చేటే చేస్తుందనీ తెలియజెప్పడమే ఉద్దేశ్యం. భారతీయ సమాజం, లాక్షణికులు విషాదాంతాన్ని అంగీకరించలేదు. సుఖాంతమే కోరుకున్నారు. ఒకప్పటి కావ్యాల్లో కేవలం ఉన్నత కులాలకు చెందిన వస్తువులే. క్రమమ్రంగా వాస్తవాలు తెలుసుకోవడం వలన సామాన్యున్ని అతిసామాన్యుని చేయడం మొదలైంది. అలా బడుగుల జీవితాలు. నిషిద్ధ మానవులైన అంటరానివారు, స్త్రీలు కావ్య వస్తువులయ్యారు. ఈ సందర్భంగా ఎండ్లూరి సుధాకర్‌ రాసిన కవితను గుర్తుచేయక తప్పదు ‘‘నా నల్ల సుందరీ!, నీలాలంకార సౌందర్య శాస్త్ర సింహాసనం మీద నిన్ను కావ్య గౌరవంతో అభిషేకిస్తున్నాను, నా నల్ల కావ్యానికి, నిన్ను నాయికగా ప్రకటిస్తున్నాను’’ అని వ్యక్తీకరించడం గొప్ప మేల్కొల్పు. గొప్ప తదాత్మ్యం. అంతకుముందు విషాదాంతం నుంచి వికాసం కలగనడంగా భావించాల్సి వస్తుంది. చెడును చెప్పితే మంచిని ఆచరిస్తారనీ నమ్మకం కావొచ్చు.

ALso REad: బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’’ కథలు : పార్ట్ - 2

‘పేగుముడి’ కథ విషాదాంతంతో ప్రారంభమై విషాదాంతంతోనే ముగుస్తుంది. ‘చావువాసన’ కథలో వీరయ్య భార్య చనిపోవడం పెద్ద విషాదాంతం. ‘శిథిల’ కథలో ప్రియాంక అభిరాంని కాదనీ వెళ్లడం కూడా. బ్రతుకు కొట్టిన దెబ్బకు జీవితమంతా విషాదంతో నిండిన కథ‘ఆమెలోనినది’. ప్రేమమీది వ్యామోహంతో పారిపోయి వచ్చిన ధనిక ఆధునిక యువతికి మరణం సంభవిచడం ‘వెంటాడిన రాత్రి’ కథలో చంపేసిన గోపాల్‌ జైలుకు వెళతానని గుర్తుకు రావడం కూడా విషాదాంతమే.

నాణేనికి రెండు పార్శావాలున్నట్లు రెండు కోణాలు చూపుతూ భార్యల విలాసాలకు భర్తలు అడ్డదారులు తొక్కడం, అవినీతి పనుల వలన ఆత్మహత్య చేసుకున్న భర్తల్ని, ఆదర్శాలు వల్లించే భర్తల ఆగడాలకు బలయ్యే భార్యల  కథ ‘రెప్పచాటు కన్నీరు’.  దొరల పెత్తనానికి బలయ్యే మాదిగ కొమురయ్య వాగులో కొట్టుకపోవడం బాధాకరం. గారడీచేసుకొని బతికే బాలీరు గురించి చెప్పే కథ ‘పాములనడుమ చీమ’. దొరవద్దన్నప్పుడు ఆట ఆడనని ఊరుకున్నాడు. కానీ ఆట ఆడాలని ఊరిజనాలు బండికి ఎదురుతిరిగారు. ఉసికొలిపారు. అదే ఉరితెచ్చినట్లైంది. కనికట్టు కత్తులకు బదులు దొరగారి కత్తి మింగటంతో బాలీరు పర్వతంలా కూలి నెత్తురుకక్కుకొని చనిపోతాడు. ఈ విషాదాంత బతుకుల్ని వ్యక్తీకరించిన కథలు మానవ వికాసం కావాల్సిందే.

అక్కన్నపేట రైల్వేస్టేషన్‌  -  భాష:  తెలంగాణ భాషవేరు. యాసవేరు. తెలంగాణ మద్యపాన వ్యతిరేకోద్యమ నేపధ్యంలో మాండలికంలో రాసిన ‘దయ్యాల పన్గడ’ అనే నాటకం వెలువడింది. సమాజం మీద ఎంతో ప్రభావితం చూపింది.  కాళోజి, వెల్దుర్తి మాణిక్యరావు, కాలువ మల్లయ్య, బి. ఎస్‌. రాములు, నందిని సిధారెడ్డి, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తం రెడ్డి కథల్లో తెలంగాణ భాష కనపడుతుంది. తెలంగాణ భాషలో రాసిన కథ ‘గాలివాన’,  ‘పాముల నడుమ చీమ’ కథలు. ‘‘రేయ్‌ బాడుకావ్’’ అని ‘ఇడ్లీ పొట్లం’ కథలో పాత్రతో అనిపించడం.   ఇంకా చెప్పాలంటే సిద్ధిపేట యాసను ఉపయోగించాడు రచయిత. ‘ఇచ్చంత్రం కల్గించే కొత్త వస్తువొకటి బస్టాండ్ల తెచ్చిపెట్టిండ్రు’, వానికి ఏనుగెక్కినంత సంబూరమైంది’ కొత్త బస్టాండ్‌ కథలో చొప్పించాడు. చెమించ్రుండి దొరా... దండం బెడ్తా. ఇంట్ల అందరు పీనుగుల్లెక్క అయ్యిండ్రు. నాకు సూతెం శాతగాక కాలు చెయ్యి ఆడతలేదు’’ అని కొమురయ్య చెప్పటం. ‘‘దొంగ గాడ్దికొడుకా నీల్గుడెక్కువైంది బే నీకు. ఏందో పాఠాలు చెప్పుతున్నవు’’ అని దొర ఉరమడం, గా శీకట్ల వొంతెన పదవి లేని నాయకుని తీర్గ డీలవడ్డట్టుగున్నది. అని ‘గాలివాన’కథలో దొర పాత్ర ద్వారా చెప్పించాడు. బాలీరును సూడంగనే అలుకుపిడుచతోని అలికినట్లు ఆమె ముఖంల సంతోషం పరుచుకున్నది’. ‘సర్పంచు సుత దొర ఇంట్లనే ఉన్నడట’, ‘సూసెటోల్లను కట్టిపడేసే మాటల సెతురత సూత ఉందతనికి’. అని మొదలైన అనే పలుకుబడులు పోలికలు చమత్కారంగా ఉపయోగించాడు. ఇంకా చెప్పాలంటే సిద్ధిపేట ప్రాంత భాషను ప్రవేశపెట్టాడు. మిగతా కథలలో హైద్రాబాదు యాసను మనము చూడొచ్చు. అన్ని ప్రాంతాలవారు హాయిగా చదువుకునే భాష వాడబడింది.

ALso REad: బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్‌’’ కథలు

అక్కన్నపేట రైల్వేస్టేషన్‌  - వర్ణనలు: అయోధ్యారెడ్డి తన కథకు బలం చేకూర్చడానికి విషయాన్ని పాఠకులకు అవగాహన కలిపించడం కోసం చక్కటి వర్ణన చేస్తాడు. సందర్భానికి తగిన వాతావరణం నాటకీయతలాగా ప్రవేశపెడుతాడు. ఇక్కడా జనమే’. ‘వడిసెలలో దూసుకొచ్చిన గులకరాయి.’, ‘కిటికీలోంచి అప్పుడే లోపలకు చొచ్చుకొచ్చిన లేత కిరణంలా వున్నదామె మొకం’, ‘మబ్బులు వీడిన ఆకాశం పసిపాపలా బోసిగా నవ్వుతోంది’. ‘ఊరు చరిత్రంతా కడుపులో దాచుకున్న స్మశానం నిశ్శబ్దంగా నిట్టూరుస్తుంది.’

అయోధ్యారెడ్డి కథల్లోని పాత్రలు నిత్యం పాఠకుల్ని సమాజాన్ని వెంటాడుతాయి. సమాజంలోని కుళ్ళును ప్రశ్నిస్తాయి? పాఠకుల మనసులను సునామీలా కంపనం సృష్టిస్తాయి. ఈ కథల్లోని వర్ణనలు, సంభాషణలు, పాఠకుని మనోఫలకంపై చెక్కుచెదరకుండా వెలిగే దీపాలుగా నిలుస్తాయి. ‘పేగుముడి’ కథలో కలలో ప్రశ్నించిన పాప ప్రతి తల్లిదండ్రుల్ని ముల్లుగర్రతో పొడుస్తుంది. బలయ్యే తల్లి. వీరయ్య భార్య ‘చావు వాసన’ కంపు కొడుతనే వుంటది. చనిపోదామనుకున్న వెంకటేశు, చేయని నేరానికి శిక్షననుభవించే ప్రియాంక, సిద్ధాంతాలన్నీ ఆకలి ముందు చిన్నవే అని చెప్పే యాదగిరి ‘ఇడ్లీ పొట్లం’.  ఆదర్శాలు ప్రదర్శించే మగాళ్ల చేతిలో బలయ్యే సరస్వతి లాంటి బలహీనులు. జీవిత విలువలు పెంపొందించాలనుకునే రచయితలను వ్యవస్థలు చంపేయడంలాంటి వాస్తవాలు సమాజంలో దుర్మార్గాన్ని వ్యక్తీకరిస్తాయి.  సంపన్న యువతి కనిపెంచిన తల్లిదండ్రుల ప్రేమకాదనీ  కనిపించని ప్రేమకోసం ఎడారి ఆశల వెంట పరిగెత్తి చనిపోయిన భానుమతి, మాయలోపడి మోసపోయిన అరవిందలాంటి వాళ్లు నిత్య తారసపడుతూనే వుంటారు. ఐదు రూపాయల కొరకు వారం రోజులు తండ్లాడిన పేదరికం అనేక జీవితాల్లో అతి మామూలు అనుభవంగా మిగిలి పోయేవిగా ఉంటాయి. భూస్వామ్య మనస్తత్వానికి బలయ్యే కొమురయ్య, బాలీరులు కనపడుతూనే ఉంటారు. 

ఎగుమామిడి అయోధ్యరెడ్డి అద్భుతమైన కథా రచయిత. కథ చెప్పడానికి కథా వాతావరణాన్ని బలంగా చిత్రీకరిస్తాడు. పాత్రలు సజీవంగా మనముందున్న భావనను కలిగిస్తాడు. పాత్రోచిత సంభాషణ ప్రవేశపెడుతాడు. కథలో ఏది ఎక్కువా? ఏది తక్కువా అన్నట్లుండదు. ఏది ఎంతమేరకు అవసరమో అంతమేరకే రాస్తడు. ప్రతీ కథను సర్వశక్తులా సమగ్రంగా తీర్చిదిద్దుతాడు. సన్నివేశానికి తగినట్టు వర్ణనలు చేస్తాడు. పరిసరాలను పరిచయం చేస్తాడు. ఆ వాతావరణంలో మనమే ఉన్నామా అనే స్థాయిలో వారి నాటకీయత ఉంటుంది. కథకు బలం చేకూరుతుంది. ఏ కథనైనా పాఠకుని మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ముద్రిస్తాడు.

అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ కథాసంపుటిలో సంభాషణ వ్యవహారికంలో ఉంటుంది. కథా రచయితగా పరిసరాలను వర్ణించిన తీరు మరిచిపోలేము. ‘అక్కన్నపేట రైల్వేస్టేషన్‌’ కథలో నువ్వు ఒంటరోడివి కావు అన్న ఒక్క మాట వెంకటేషు గుండెల్లో రాసిపోసి ఉన్న బాధనీ, వేదనని తవ్వితీసింది. కనకన మండే నిప్పునైనా చల్లార్చేలా ఉన్నాయా అనే మాటలు. ఆమె స్వరం మెత్తగా, మంద్రంగా ఉంది. చెట్లమీద ఆకులు కదలని ప్రశాంతత ఆమె ముఖంలో ఉంది. ఆమె ఆత్మీయత అతన్ని కదిలించింది. భరోసా కలిగించింది. ఆత్మహత్య చేసుకోవాలనే బలమైన కోరిక నుంచి బతుకుమీద ఆశలు చిగురింపజేసింది.

‘చావువాసన’ కథలో వాడిన వర్ణనలు అత్యంత సహజంగా ఉన్నాయి. అందులో కొన్ని ‘చల్లటి సరస్సులోంచి నిప్పుల కొలిమిలో దూకినట్లు’, ‘భూమిలోంచి మొలుచుకొచ్చిన గడ్డి మొక్కల్లా ఉన్న జనం. వృద్దుడి చర్మం బతుకువేడిలో ముడుతలు పడిపోయి అతని అనుభవాలను దాచి పెడుతున్నట్లుంది. పీనుగుచుట్టూ చేరిన రాబందుల్లా.., మూటకట్టిన వస్తువులా(పుట.35)ఉంది అనేమాటలో అక్కడి పరిస్థితి కళ్లకట్టినట్లు చూపాడు.  ‘ఇడ్లీపొట్లం’ కథలో బస్టాప్ కి కొద్దిదూరంలో ఎన్నేళ్లనాటిదో పెద్ద రావిచెట్టు. వివిధ పార్టీలు కట్టిన జెండాలతో, బ్యానర్లతో తాళ్లనడుమ బందీ అయినట్లుగా ఉన్నది. బట్టతల తడుముకుంటూ.  పిరికిగా నమస్కరించి దీనంగా వాళ్ల ముఖాల్లోకి చూస్తూ నిలుచున్నాడు(పుట.71) అని వివరిస్తాడు. దిక్కులేని జాలిచూపులే అవి (పుట.72) అని ఆ పాత్ర సహజత్వాన్ని చిత్రీకరిస్తాడు.

ఒక రచయిత మరణం కథలో సరి సమానమైన తూనికరాళ్లతో కొలిచినట్లు ఉపమానాలు వెదజల్లుతాడు. సావిత్రిని కదిలిస్తే రాళ్లు కరిగే కష్టాలు ప్రవహించినయి. అనేక కష్టాలు చుట్టుముట్టినై. నా భర్తలెక్క నాదికూడా సగం బతుకే.  నిజంగా పేగుల్ని ముడిసినట్లే పేగుముడి కథలోని బాధ పాఠకుని మనసుని పిండేసినట్లు అవుతుంది. దేవలోకం నుండి దిగివచ్చిన పాప వ్యవస్థను ప్రశ్నించింది. సావిత్రి పాత్ర అత్తకు మామకు, భర్త మాటలకు ఎదురుచెప్పలేక అడుగడుగుకు కుమిలిపోతున్న బలహీనుల స్త్రీల గొంతు. బలిపీఠమెక్కిన స్వరంగా నిలుపడం పాఠకుల హృదయంలో చెమ్మపేరుకుపోతుంది.  పూలరేకుల్లా బలహీనంగా మూసుకున్న కళ్లు(పుట.51). పిడికిళ్లు బిగించి తలుపుల మీద కొడుతూ నిలదీసింది(పుట.55). ఒక తల్లిపడే ప్రసవవేదన కాదది. ఒక భ్రూణహత్యకు సిద్ధపడుతున్నందుకు జరుగుతున్న ఘర్షణ(పుట.57) మొదలైన వాక్యాలను చిత్రించడం ద్వారా కథలో మనమున్నామనే భావన కలుగుతుంది.

‘శిథిల’ కథలో రచయిత అద్భుతమైన అలంకారాలతో వివరించాడు. ‘చంకలో తల్లి ముఖాన్ని అరచేతులతో నిమిరినట్టు’(పుట.59), ఆపదనుంచి ఎలా కాపాడుకోవాలో తెలిపిన ఉపమానం సరిపోయేదిగా ఉంది. వర్షంలో వచ్చిన కారాగింది. దిగిన మనిషి వానకడ్డంగా చేతులతో మొకం కప్పుకోవడం ఒక జీవితకాలానికి సరిపడే పోలిక. అది పాఠకమదిలో చెరుగనిదృశ్యం. పాఠకునికి కలవబోతున్నవేళ ఈ పోలిక ఎందుకు వేసిండో కథ చివరిదాకా చదివితే కానీ అర్థంకాదు. ‘పొత్తి కడుపులో బాధకన్నా మనసుకైన గాయం నొప్పి తీవ్రమై ఆమె విలవిల్లాడిరది.’, కత్తిగాట్లు పెడుతున్న నొప్పి(పుట.63). జీవంలేని స్వరం(పుట.65). జ్ఞాపకాల పూలతో వొడినింపుకొని వెళుతుంటుంది(పుట.66). ఆ ఇద్దరూ యుద్ధంలో ఎదురెదురూ పొరాడుతూ మౌనాన్నే అంతిమ అస్త్రంగా సంధించి వదులుతున్నారు (పుట.69). అభిరాం జరుగుతున్న లోపాన్ని సరిదిద్దుకోలేదు. బాధలో ఉండుమనీ అరచి గీపెట్టినప్పుడు చులకనగా మాట్లాడుతూ ‘‘ఉండి ఏం చేయ్యాలి...? ఇంకేం మిగిలిందనీ ఉండాలి..?’’ అని ధిక్కరిస్తాడు. ఉద్యోగం మానేయమనడం అంతర్లీనంగా ఉన్న పురుష అహంభావానికి నిదర్శనంగా ఉంది. తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినా భర్తీచేసుకోలేనంత ప్రియాంక మనసుకు దూరంగా పడిపోయాడు. ఇలాంటి వాక్యాలు ఉపయోగించడం ద్వారా కథ బలిష్టంగా చెప్పబడింది.

కిటికీలోంచి అప్పుడే లోపలకు చొచ్చుకొచ్చిన లేతకిరణంలా వున్నదామె ముఖం’. ‘ఆమెలోని అంతర్వాహినిలాంటి హృదయఘోష’(పుట.98) వినపడుతుందనడం సరైన పోలిక. అస్తమా రోగిలా ఆమె. శవం మీద మురికి దుప్పటి కప్పుతున్న దృశ్యం కళ్లముందు మాటిమాటికి కనిపిస్తోంది. ఏ ఆర్నెళ్ల క్రితమో ఉతికినట్లున్న మురికి అంగి, నిక్కరుతో ప్రత్యక్షమయ్యాడో పద్నాలుగేళ్ల కుర్రవాడు. మొదలైన ఉపమానలతో సుళువుగా అర్థం చేయించాడు. ‘‘చాలా పెద్దచిక్కు వచ్చింది అరూ....! దీన్ని ఆ నరసింహస్వామి సాల్వ్‌ చెయ్యాల్సిందే...’’(పుట.122) దిగులు స్వరం(పుట.123)చెప్పటం.

అక్కన్నపేట రైల్వే స్టేషన్‌ కథల గురించి ముందు మాటలో...
అయోధ్యారెడ్డిది బలమైన కలం. మంత్రించి చదివించే ప్రత్యేకమైన శైలి. అవలీలగా కథ రాయగల నైపుణ్యం ఆయన సొంతం. సమాజంలో నెలకొనివున్న విలువలు, మధ్యతరగతి భావనలు, సంఘర్షణలు, మారుతున్న కుటుంబ సంబంధాలు, వర్గ స్పృహ, స్త్రీల పట్ల వివక్ష ఈ కథల్లో ఆయన ఎంతో బలంగా చిత్రించారు.’’ అని నందిని సిధారెడ్డి అభిప్రాయపడ్డారు. 

‘‘అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ కథలన్నీ కేవలం కథలు కావు. జీవన సత్యాలు. కథల రూపెత్తిన బతుకు వ్యధలు. తాను రాయకుండా వుండలేని తనంలోంచి ఉబికి వచ్చిన సామాజికుల వ్యవస్థీకృత రూపాలు ’’ గా థింసా తన ముందుమాటలో పేర్కొన్నారు.

‘‘ఈ కథా సంపుటిలో దొరల పాలన నుండి ఇప్పటివరకు తెలంగాణలో వచ్చిన ఆర్థిక, సామాజిక పరిణామాలను ఒక సమస్యను బొమ్మా బొరుసులా రెండు వైపులా చూసి చర్చించి, కథలను రాయడంలో రచయిత మంచి నేర్పు కనబరిచారు. అని కె.పి. అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు.

‘‘ఒక కథను చదివిన తరువాత మనసు చలించాలి. మళ్ళీ పదేళ్ళో, ఇరవై యేళ్ళో పోయిన తరువాత చదివినా అదే అనుభూతి, స్పందన కలగాలి. అప్పుడే అది గొప్ప కథ అవుతుంది’’ అని వాకాటి పాండురంగారావు చెప్పినట్లుగా వ్యవస్థ మారాలనీ కథా సాహిత్యాన్ని ఎంచుకుని గొప్ప కథలు అందించిన అయోధ్యారెడ్డికి అభినందనలు.

‘‘కవిని కనిన తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని పొందవాడు మృతుడు కాడు’’ అని గుర్రం జాషువా చెప్పినట్లు పాఠకుల అభిమానాన్ని పొందిన కథలను సేకరించి, ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందజేయడం కోసం మాడభూషి కళాపీఠం చేస్తున్న కృషి అభినందనీయం. అనిర్వచనీయం. మంచి పుస్తకానికి ఇచ్చిన పురస్కారం సాహిత్య చరిత్రలో తప్పక నిలిచిపోతుంది. 

పురస్కారం ప్రధానం చేయాలంటే అనేక పుస్తకాలను చదువాలి. వడపోయాలి. అత్యుత్తమ కథా సంపుటి ఎంపిక చేయాలి. అందుకోసం న్యాయనిర్ణేతలు కావాలి. పారదర్శకంగా ఎంపికచేయడంలో సహాయపడడం. ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందజేయడంతో పాటు విశ్లేషణాత్మక వ్యాసాన్ని రాయించడం. సవరణలు చేయడం. ఆ వ్యాసాన్ని ప్రచురించడం పురస్కారం అందజేస్తున్న రోజునే ఆవిష్కరించాలనుకోవడం అంకితభావానికి, అంకుఠిత దీక్షకు ఇది పతాక. నిఖార్సైన దక్షతకు నిదర్శనం. తెలుగు కథకు సేవచేస్తున్న మాడభూషి కళాపీఠానికి, పురస్కారానికి ఎంపికైన గ్రంథ రాజం, కథారత్నం ‘‘అక్కన్నపేట రైల్వేస్టేషన్‌’’ సమీక్ష చేయడానికి నాకు అవకాశం కల్పించిన నాళేశ్వరం శంకరం, లలితాదేవి, మాడభూషి సాహిత్య పురస్కార కమిటీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.

                          ( సమాప్తం )

click me!