A.M. Ayodhya Reddy : కథల సంపుటి 'సీతంబాయి పొలం' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు ఏఎం అయోధ్య రెడ్డి మాట్లాడుతూ.. ఈ స్పీడ్ యుగంలో కథలు చదివే పాఠకులు కరువయ్యారనీ, మరీ ముఖ్యంగా ఈతరం యువత, పిల్లలు తెలుగు సాహిత్యానికి దూరమవుతున్నారని అన్నారు.
తెలంగాణకు చెందిన ప్రముఖ కథా రచయిత, సీనియర్ పాత్రికేయుడు ఏయం. అయోధ్యారెడ్డి తాజా కథల సంపుటి 'సీతంబాయి పొలం' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం గచ్చిబౌలిలోని గోపన్ పల్లి జర్నలిస్టు కాలనీకి చెందిన సొసైటీ కార్యాలయం హాలులో జరిగింది. ప్రముఖ కథా రచయిత, సీనియర్ పాత్రికేయుడు, పూర్వ 'నవ్య' వీక్లీ సంపాదకుడు ఏ.ఎన్.జగన్నాథశర్మ కార్యక్రమానికి హాజరై తన చేతుల మీదుగా కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్థానిక 'జర్నలిస్టుల ఫోరం' ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి ఆత్మీయ అతిథిగా హాజరైన అయోధ్యారెడ్డి కథా రచయితగా తన సుదీర్ఘ కథా రచన ప్రయాణంలోని విశేష అనుభవాలను వెల్లడించారు.
ఈ స్పీడ్ యుగంలో కథలు చదివే పాఠకులు కరువయ్యారనీ, మరీ ముఖ్యంగా ఈతరం యువత, పిల్లలు తెలుగు సాహిత్యానికి దూరమవుతున్నారని పేర్కొన్న ఆయన అప్పట్లో ఇటువంటి పరిస్థితి లేదని అయోధ్యారెడ్డి అన్నారు. కథలు రాసేవాళ్ళు కూడా ఇప్పుడు కరువయ్యారని తెలిపారు. అప్పటి గొప్ప, పెద్ద రచయితలు, కవులను ఇప్పటి తరం అసలు గుర్తు పట్టడమే లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇది సమాజానికి మంచి పరిణామం కాదనీ, మారాలని అన్నారు. జగన్నాథ శర్మ మాట్లాడుతూ, సాహిత్యానికి, కథా వస్తువులకు ఎప్పుడూ మరణం వుండదనీ, కాకపోతే కాలంతోపాటు పరిణామాత్మక మార్పు వుంటుందని గుర్తు చేశారు. అందువల్ల మనం బాధ పడాల్సిన పని లేదని చెప్పారు.
తనకు కథలు అంటేనే ఎంతో ఇష్టమనీ, ఎంతో తపనతోనే ఇప్పటికీ రచనలు చేస్తున్నానని అయోధ్యారెడ్డి అన్నారు. నిజ జీవిత సంఘటనలే తన కథలకు ఇతివృత్తాలని చెప్పారు. యదార్థ జీవన స్పర్షతోనే కథలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. 'సీతంబాయి పొలం' తన నాలుగో కథల పుస్తకమని చెప్పారు. అప్పట్లో పత్రికల్లో కథలు అచ్చయితే ఎంతో కొంత గౌరవ రుసుము ఇచ్చేవారనీ, అలా కొంత డబ్బు సంపాదించుకోవచ్చునన్న ఆశ, ఆలోచనతోనే కథలు రాశానని తెలిపారు. ఆ తర్వాత నుంచీ డబ్బుకు అతీతంగా కథా సాహిత్యాన్ని, రచనా ప్రక్రియను నిజాయితీగా ప్రేమించడం మొదలుపెట్టి అంకితభావంతో రాస్తున్నానని తెలిపారు. తపన లేకపోయినా, పాఠకుల ఆదరణ పొందకున్నా ఎవరూ ఇన్నేసి కథలు రాయరని చెబుతూ, తన పరిస్థితీ అంతేనని అన్నారు. ఎంతో తపనతో ప్రతీ కథనూ సృష్టిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజల యధార్థ, వ్యధార్థ ఆర్ద్ర జీవన అనుభవాలే తనకు కథా వస్తువులు అయ్యాయనీ, ఏదో టైమ్ పాస్ కోసం తాను కథలు రాయనని అయోధ్యారెడ్డి చెప్పారు. నాలుగు దశాబ్దాల క్రితం మొదలైన తన సుదీర్ఘ కథల అక్షర సాగు కొన్నేళ్ల తర్వాత వృత్తిరీత్యా జర్నలిజంలోకి రావడం వల్ల కొన్నాళ్ళపాటు నిలిచి పోయిందని తర్వాత 'దక్కన్ క్రానికల్' సంస్థలో 'న్యూస్ ఎడిటర్'గా రిటైర్ అయ్యాక మళ్ళీ సీరియస్ గా రాయడం ప్రారంభించానని చెప్పారు. ఇప్పటికి సుమారు వంద కథలు, రెండు నవలలు రాసిన అయోధ్యారెడ్డి, నలభై విదేశీ కథలు, ఒక విదేశీ నవల అనువదించారు.
అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సీనియర్ కవులు, రచయితలు, కార్టూనిస్టులు, జర్నలిస్టులలో పరాంకుశం వేణుగోపాల స్వామి, కాసుల ప్రతాప్ రెడ్డి, గురువారెడ్డి, లక్ష్మణ్ రావు, రమణజీవి, సురేంద్ర, నర్సిమ్, తల్లావజ్జుల లలితాప్రసాద్, తిరుమలగిరి సురేందర్, పెద్దిరాజు, జగన్ (జగన్మోహన్ రావు), వై.హనుమంతరావు, దోర్బల బాలశేఖర శర్మ ఉన్నారు.