మనలో చాలా మంది అప్పులు చేస్తూనే ఉంటారు. అవసరం అలా చేయిస్తుంది. కొన్ని కొన్ని సమయాల్లో చేతుల్లో చిల్లి గవ్వ కూడా ఉండదు. అత్యవసర పరిస్థితులు వస్తుంటాయి. దీంతో అప్పులు తప్పక చేయాల్సి వస్తుంది. కానీ ఎవ్వరికీ అప్పులు చేయాలని ఉండదు. కానీ పరిస్థితులు మనచేత చేయిస్తాయి. కానీ అప్పులు చేస్తూ పోతే అప్పులు ఊబిలో కూరుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ దీనిలోంచి బయటపడటం అసాధ్యమే. మన చుట్టు పక్కల వారినే చూస్తుంటాం.. ఒక అవసరానికి అప్పు తీసుకుని.. ఆ అప్పు ఇచ్చిన వాడు డబ్బు అడితే దీనికోసం మరొక అప్పు చేస్తాడు. దీన్ని తీర్చడానికి మరో అప్పు చేస్తాడు. ఇలా అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉంటారు. అప్పుల వాడు ఇంటిమీద పడి ఎంత గొడవ చేసినా.. పరువుపోవడమే కానీ.. చేసేదేమీ ఉండదు. అందుకే వీలైనంత వరకు అప్పులు చేయకుండా ఉండాలి. ఇది మనచేతుల్లో ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ మీరు కొన్ని టిప్స్ ను పాటిస్తే జీవితంలో అప్పులు తీసుకోవాల్సిన అవసరం రానేరాదు. అప్పుల ఊబిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
debt waiver
అప్పు చేసి కొనొద్దు
అప్పు చేసి కొనే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది. కానీ దీనివల్ల మీరు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. అందుకే డబ్బులు లేకున్నా కొనే అలవాటును మానుకోండి.
అత్యవసర డబ్బు
మీరు అప్పులు చేయొద్దు అనుకుంటే మాత్రం మీ దగ్గర అత్యవసర డబ్బును ఉంచుకోండి. ఇందుకోసం మీ ఆరు నెలల జీతాన్ని ఆదా చేయండి. వీటిని ఖర్చులకు మాత్రం ఉపయోగించకండి. ఒకవేళ మీకు ఉద్యోగం పోయినా.. వైద్య ఖర్చుల కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది. దీనివల్ల మీరు వేరేవాళ్ల నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
మీ అవసరాలపై మాత్రమే దృష్టి
అప్పులు చేయొద్దంటే మాత్రం మీ విలాసాలకు స్వస్తి పలకండి. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మాత్రం ఖచ్చితంగా అప్పులు చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీ చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటానికి మీ అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేయండి. దీనికోసం మీరు ఇతరుల నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి లగ్జరీ కంటే అవసరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి.
debt
బడ్జెట్ పై ప్రణాళిక
మీకు నెలకు ఎంత ఖర్చు వస్తుందనేది ఒక బుక్ లో రాసుకోండి. దీనివల్ల మీరు డబ్బును ఎక్కడ వృథాగా ఖర్చు పెడుతున్నారో? ఎక్కడ ఖర్చు ఎక్కువగా చేస్తున్నారో తెలుసుకోవచ్చు. దీనివల్ల మీరు అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు.
క్రెడిట్ కార్డు వాడకండి
కొంతమందికి క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగించే అలవాటు కూడా ఉంటుంది. కానీ అది అస్సలు మంచిది కాదు. మీరు క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగిస్తుంటే.. ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో మీకు తెలియకపోవచ్చు. అలాగే ఛార్జీలు వసూలు చేయబడతాయి. అందుకే క్రెడిట్ కార్డుల వాడకాన్ని తగ్గించండి. ఎప్పుడూ చేతిలో డబ్బును ఉంచుకోండి.
జీతం పెరిగితే
చాలా మందికి జీతం పెరిగితే పట్టరాని ఆనందం కలుగుతుంది. ఈ ఆనందంలో డబ్బును బాగా ఖర్చుచేస్తుంటారు. అంటే దీనితో విలాసవంతంగా బతకొచ్చని అనుకుంటారు. అప్పులు చేయకూడదంటే డబ్బు ఆదా చేయడం నేర్చుకుని తక్కువ జీతంతో బతకడం నేర్చుకోండి. అప్పులు అప్పులు చేయాల్సిన అవసరం రాదు.