విమర్శలు సరే.. కానీ బండ బూతులు తిడతారు.. అందుకే నేను ఆ పని చేయను : వసీం అక్రమ్

First Published Feb 2, 2023, 11:36 AM IST

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా  ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ మికీ ఆర్థర్ ను మళ్లీ టీమ్ లోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నది. అయితే ఈసారి అతడిని భౌతికంగా కాకుండా  ఆన్లైన్ ద్వారా  కోచింగ్ ఇప్పించేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో  అక్రమ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. 

పాకిస్తాన్ క్రికెట్ లో దిగ్గజ బౌలర్ గా వెలుగొందుతున్న  వసీం అక్రమ్ ఆ జట్టుకు  హెడ్ కోచ్ గా ఉండటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెట్ లో టీమ్  ఓడితే  విమర్శించడం వరకు ఓకే గానీ ఏకంగా బండబూతులు తిడతారని  అన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

అక్రమ్ మాట్లాడుతూ.. ‘నేను ఏనాడూ పాకిస్తాన్  క్రికెట్ జట్టుకు కోచింగ్ ఇచ్చే అంశాన్ని పరిశీలించలేదు.  దేశంలో కోచ్ లు, కెప్లెన్లు మ్యాచ్ లు ఓడినప్పుడు తీవ్ర దూషణలకు గురవుతారు.  జట్టు బాగా ఆడనప్పుడు విమర్శిస్తే  దానిని అర్థం చేసుకోగలం. అది సబబు కూడా.  

కానీ  మ్యాచ్  ఫలితాలతో సంబంధం లేకుండా కొన్నిసార్లు కెప్టెన్, హెడ్ కోచ్, కోచింగ్ సిబ్బందిపై దూషణలకు దిగుతారు. వ్యక్తిగత దూషణలు కూడా ఉంటాయి.  చాలామంది కెప్టెన్లు, హెడ్ కోచ్ లు దీనిని అనుభవించినవారే. కానీ వాటిని భరించే నా వల్ల కాదు.  నాకు అంత సహనం లేదు. 

మరీ ముఖ్యంగా   సోషల్ మీడియాలో ఈ పోకడ మరీ దారుణంగా ఉంది. కొంతమంది పనీ పాట వదిలేసి కేవలం ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలలో  కెప్టెన్, కోచ్ లను విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఆ ఇద్దరినీ తిట్టడమే వీళ్లకు పని. అందుకే జాతీయ జట్టుకు  కోచింగ్ ఇచ్చే బాధ్యతలను నేను తీసుకోవడం లేదు..’అని చెప్పాడు. 

అయితే జాతీయ జట్టుకు  కోచింగ్ ఇవ్వకున్నా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో మాత్రం అక్రమ్.. కరాచీ కింగ్స్ కు బౌలింగ్ కోచ్ గా సేవలందిస్తున్నాడు.  దీనిపై అక్రమ్ స్పందిస్తూ.. జాతీయ జట్టు, పీఎస్ఎల్  పూర్తిగా భిన్నమైనవని వ్యాఖ్యానించాడు.  

కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా  ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ మికీ ఆర్థర్ ను మళ్లీ టీమ్ లోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నది. అయితే ఈసారి అతడిని భౌతికంగా కాకుండా  ఆన్లైన్ ద్వారా  కోచింగ్ ఇప్పించేందుకు సిద్ధమవుతున్నది.  ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ లో ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తున్న క్రమంలో  అక్రమ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 
 

click me!