KKR vs DC: ఐపీఎల్ 2024 ప్రారంభంలో తడబడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. కానీ, సొంత మైదానంలో కేకేఆర్ ఆల్ రౌండ్ షో తో తమతో తలపడేందుకు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుగా ఓడించింది.
KKR vs DC: రిషబ్ పంత్ లెక్కతప్పింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు రాణించకపోవడంతో కేకేఆర్ చేతిలో ఓటమి తప్పలేదు. ఐపీఎల్ 2024 ప్రారంభంలో తిరోగమనంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ చివరి మ్యాచ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడం ద్వారా ప్లేఆఫ్స్ కోసం రేసులోకి ప్రవేశించింది. ఢిల్లీ సొంతగడ్డపై రెండు విజయాలను నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ తో తలపడేందుకు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ కు పూర్తిగా ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.
టాప్ ఆర్డర్ కుప్పకూలింది..
ఐపీఎల్ 2024 47వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఈ నిర్ణయం పంత్ కు అనుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. ఢిల్లీ టాప్ ఆర్డర్ పూర్తిగా ఫ్లాప్ కావడంతో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. పృథ్వీ షా 13 పరుగులు, జాక్ ఫ్రేజర్ 12 పరుగులు చేసి త్వరగానే పెవిలియన్ కు చేరారు. అభిషేక్ పోరెల్ కేవలం 18 పరుగులు చేసి ఔటయ్యాడు. షాయ్ హోప్ ఫ్లాప్ షో కొనసాగింది. కెప్టెన్ పంత్ బాధ్యతను అర్థం చేసుకున్నాడు, కానీ 27 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వలలో చిక్కుకున్నాడు.
చివరలో కుల్దీప్ యాదవ్ మెరుపులు..
ఢిల్లీ తరుపున 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కుల్దీప్ యాదవ్ ఢిల్లీ పరువును కాపాడాడు. జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కుల్దీప్ నిరూపించుకున్నాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 35 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కుల్దీప్ ఇన్నింగ్స్ ఆధారంగా జట్టు స్కోరు బోర్డుపై 153 పరుగులు చేయగలిగింది. కేకేఆర్ తరఫున వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా లు చెరో రెండు వికెట్లు తీశారు. అలాగే, స్టార్క్, సునీల్ నరైన్ కూడా తలో వికెట్ తీశారు.
ఫిల్ సాల్ట్ ఒంటిచేత్తో మ్యాచ్ ను కేకేఆర్ కు అందించాడు..
154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ జట్టు అద్భుతంగా ఆరంభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన బ్యాటింగ్ తుఫానుతో ఢిల్లీ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సాల్ట్ వికెట్ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ చివరి వరకు ఉండి కేకేఆర్ కు విజయాన్ని అందించారు. కేకేఆర్ జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులోకి బలమైన పునాది వేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.