ICC T20 World Cup 2024 : గాయం కారణంగా పేసర్లు కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నేలు టీ20 ప్రపంచకప్ 2024 కు దూరమయ్యారు. టామ్ లాథమ్, టిమ్ సీఫెర్ట్, విల్ యంగ్ కూడా ప్రపంచకప్ టోర్నీకి కివీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
ICC T20 World Cup 2024 - New Zealand : త్వరలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి 15 మంది ఆటగాళ్లతో బలమైన న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ప్రకటించింది. కివీస్ జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 9వ ఎడిషన్ జూన్ 01 నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జరగనుంది.
కేన్ విలియమ్సన్ ఇప్పుడు ఆరోసారి టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. కివీస్‌ను నాలుగోసారి కెప్టెన్‌గా ముందుకు నడిపించనున్నాడు. వెటరన్ పేసర్ టిమ్ సౌథీకి ఇది 7వ టీ20 ప్రపంచకప్ కాగా, లెఫ్టార్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌కు ఇది 5వ టీ20 ప్రపంచకప్. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు తొలి టీ20 ప్రపంచకప్ గెలవాలని కలలు కంటోంది. దీని కోసం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లతో జట్టును ప్రకటించింది.
గాయం కారణంగా పేసర్లు కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నేలు ప్రపంచకప్ జట్టుకు దూరమయ్యారు. టామ్ లాథమ్, టిమ్ సీఫెర్ట్, విల్ యంగ్ కూడా ప్రపంచకప్ టోర్నీకి కివీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, స్పీడ్‌స్టర్ మ్యాట్ హెన్రీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడంతో కివీస్ జట్టులో ఆశ్చర్యకరమైన ఎంపికలు పెద్దగా లేవు. న్యూజిలాండ్ జట్టులో ఎంతో మంది అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లు ఉండడంతో టీ20 ప్రపంచకప్ 2024ను గెలవాలని కలలు కంటోంది.
న్యూజిలాండ్ జట్టు ఇదే..
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ బ్రాస్‌వెల్, మార్క్ ఛాంప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారెల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ.
ఇదిలావుండగా, న్యూజిలాండ్ రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్‌లో గ్రూప్ సీ లో ఉంది. జూన్ 07 న గయానాలో ఆఫ్ఘనిస్తాన్‌తో తన తొలి మ్యాచ్ తో మెగా టోర్నీలో ముందుకు సాగనుంది. ఇదే గ్రూప్‌లో ఆతిథ్య వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూ గినియా జట్లు ఉన్నాయి.