తిరుమల నడకదారిలో చిరుత దాడి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత నెలలో నడకదారితో వెళ్తున్న సమయంలో చిరుత దాడి చేయడంతో ఆరేళ్ల బాలిక లక్షిత మృతిచెందడం భక్తుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది.
తిరుమల నడకదారిలో చిరుత దాడి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత నెలలో నడకదారితో వెళ్తున్న సమయంలో చిరుత దాడి చేయడంతో ఆరేళ్ల బాలిక లక్షిత మృతిచెందడం భక్తుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన టీటీడీ, అటవీ శాఖ అధికారులు చిరుతలను బంధించేందుకు బోన్‌లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా చిరుతలు బోన్‌లో చిక్కాయి. అయితే అలా చిక్కిన నాలుగు చిరుతల్లో చిన్నారిని హతమార్చిన చిరుత ఏది అనే విషయాన్ని తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే చిరుతల నమునాలను అటవీశాఖ అధికారులు డీఎన్‌ఏ పరీక్షకోసం పంపించారు. అయితే తాజాగా పట్టుబడిన నాలుగు చిరుతల్లో రెండు చిరుతల డీఎన్ఏ నివేదికలు వచ్చాయి. ఈ నివేదికల్లో చిన్నారిపై దాడికి మొదటి రెండు చిరుతలకు సంబంధం లేదని తేలింది. ఈ క్రమంలోనే ఒక చిరుతను విశాఖ జూ పార్క్‌కు తరలించారు. మరో చిరుతను నల్లమల అటవీ ప్రాంతంలోని గుండ్ల బ్రహ్మేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో అటవీ అధికారులు విడిచిపెట్టారు.
అయితే మిగిలిన రెండు చిరుతలకు సంబంధించి డీఎన్‌ఏ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. అయితే నివేదికతో సంబంధం లేకుండా ఈ రెండు చిరుతలను తిరుపతి జూ పార్క్‌లోనే ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. వాటి పళ్లు ఉడిపోవడంతో.. అవి స్వతహాగా వేటాడే సామర్థ్యం కోల్పోయినందుకు జూలోనే ఉంచాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ఇక, ఆగస్ట్ 12న అలిపిరి నడకదారిలో లక్షిత అనే చిన్నారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో బాలిక మృతిచెందింది. ఈ సంఘటన తర్వాత అటవీ శాఖ వేగంగా స్పందించింది. టీటీడీ అటవీ విభాగం సహకారంతో 'ఆపరేషన్ చిరుత' ప్రారంభించింది. ఆపరేషన్ సమయంలో.. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, 7వ మైలు స్ట్రెచ్ సమీపంలో ఉంచిన బోనులలో ఇప్పటివరకు నాలుగు చిరుతపులులను బంధించారు.
ఆగస్టు 14న మొదటి చిరుతపులి బోన్‌లో చిక్కింది. అది సుమారుగా 4-5 సంవత్సరాల వయస్సు గల ఆడ చిరుత. మూడు రోజుల తర్వాత ఆగస్టు 17న.. దాదాపు ఐదు సంవత్సరాల మగ చిరుతపులిని బంధించారు. అనంతరం మూడవ చిరుతపులిని ఆగస్టు 28న ఏడో మైలు దగ్గర, నాలుగో చిరుతను సెప్టెంబర్ 7న అలిపిరి ఫుట్‌పాత్‌కు సమీపంలోని ఎలిఫెంట్ ఆర్చ్ దగ్గర బంధించారు.