విశాఖపట్నంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. రాత్రి పడుకునే ముందు ఉన్న పళ్ల సెట్ ఉదయం లేచే సరికి కనిపించ లేదు. దీంతో ఏదో ఇబ్బందిగా అనిపించిన సదరు వ్యక్తి నేరుగా వైద్యుల వద్దకు వెళ్లాడు. వెంటనే విషయం తెలుసుకున్న వైద్యులు అతనికి ఎక్స్‌రే, సిటీ స్కాన్ చేశారు. అప్పుడు తెలిసింది ఆ పళ్ల సెట్ ఎక్కడుందన్న విషయం..
సాధారణంగా పళ్లు ఊడిపోయిన వారికి లేదా బలహీనంగా మారిన వారికి వైద్యులు వాటి స్థానంలో కృత్రిమ దంతాలను అమరుస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేక పళ్ల సెట్స్ అందుబాటులోకి వచ్చాయి కూడా. అయితే కొన్ని పళ్ల సెట్లను మనకు నచ్చినప్పుడు తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండా పళ్ల సెట్ ఊడిపోతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
వివవరాల్లోకి వెళితే.. విశాఖపట్నంకు చెంది 52 ఏళ్ల ఉద్యోగి మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. వైద్యులు ఆయనకు పర్మినెంట్‌గా ఉండే పళ్ల సెట్‌ను అమర్చారు. ఈ క్రమంలోనే తాజాగా రాత్రి పడుకున్న సమయంలో పళ్ల సెట్ ఊడిపోయింది. అయితే నిద్రమత్తులో ఆయన ఆ విషయం గమనించకుండా పళ్ల సెట్‌ను మింగేశాడు. ఉదయం లేచే సరికి పళ్ల సెట్ మిస్ అయిన విషయాన్ని గమనించాడు. అంతలోనే దగ్గు రావడం ప్రారంభమైంది. దీంతో ఏదో జరిగిందనుకున్న అతను వెంటనే వైద్యులను సంప్రదించాడు.
కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ అతన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎక్స్‌రే, సిటీ స్కాన్ చేసి చూశారు. దీంతో ఊడిన పళ్ల సెట్ కుడి ఊపిరిత్తిలోకి వెళ్లిందని వైద్యులు నిర్ధారించారు. పళ్ల సెట్‌ను మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. కుడి ఊపిరితిత్తి మధ్య భాగంలో ఇరుక్కున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది.
దీంతో వెంటనే ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశామని డాక్టర్ భరత్ తెలిపారు. పళ్ల సెట్‌కు రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు. అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యిందని చెప్పుకొచ్చారు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీని ఇందుకోసం ఉపయోగించినట్లు తెలిపారు.
undefined
ఇక ఈ విషయమై భరత్ ఇంకా మాట్లాడుతూ.. 'సాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది' అని తెలిపారు.