ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు  

By Arun Kumar P  |  First Published Jan 8, 2025, 9:56 PM IST

విశాఖపట్నంను ముంబై తరహాలో ఆంధ్ర ప్రదేశ్ కు రాజధానిని చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందే ప్రకటించారు.


Nara Chandrababu Naidu : ఆంధ్ర ప్రదేశ్ కు విశాఖపట్నంను రాజధానిగా చేస్తానని గత వైసిపి ప్రభుత్వం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా కూడా ప్రయత్నాలు కూడా చేసారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ రాజధాని అంశం మరుగున పడింది. కానీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ రాజధానిగా చేస్తానని స్వయంగా ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు... కానీ గతంలో వైఎస్ జగన్ అన్నట్లు పాలనా రాజధాని కాదు ఆర్థిక రాజధాని. దేశానికి ముంబై తరహాలో ఏపీకి వైజాగ్ ను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన బహిరంగసభకు ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర,రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... విశాఖ అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ఈ నగర బ్రాండ్ ను పెంచుకుంటూ వెళుతున్నామని...తద్వారా ఈ ప్రాంతాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. 

మన రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖ మారడం ఖాయం. ఒక ఐటి హబ్‌గా, ఒక ఫార్మా హబ్‌గా, ఒక టూరిజం హబ్‌గా విశాఖని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. pic.twitter.com/YUS53fbgGy

— Telugu Desam Party (@JaiTDP)

Latest Videos

 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ఏపీ ప్రజలు నమ్మకం వుంచి ఎన్డిఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించారు... ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.  తమకు అండగా నిలిచిన ప్రజల కోసం ప్రధాని ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులు, అభివృద్ది పనులను రాష్ట్రానికి ఇస్తున్నారని అన్నారు. తన రాజకీయ జీవితంలోనే ఇలాంటి ప్రధానిని ఇప్పటివరకు చూడలేదని చంద్రబాబు కొనియాడారు.

విశాఖ రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ... అది త్వరలోనే నెరవేరబోతోందని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్ కోసం  భూమిని కేటాయించిందని తెలిపారు.  

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న వ్యక్తి మోదీ అని చంద్రబాబు ప్రశంసించారు. విశాఖలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మోదీ అభిమానం ఉత్తరాంధ్రకే పరిమితం అని కొందరు అంటున్నారు... కానీ ఆయన అన్ని ప్రాంతాల అభివృద్దికి కోరుకుంటారని అన్నారు. అందుకు అమరావతి, పోలవరం నిర్మాణాలకు కూడా కేంద్రం అందిస్తున్న సహకారమే ఉదాహరణగా చంద్రబాబు పేర్కొన్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ, మిత్రుడు పవన్ కల్యాణ్ తో కలిసి ప్రజలముందుకు వెళ్లామని చంద్రబాబు తెలిపారు. తమ కూటమిపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని... అందువల్లే తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విజయం చూసానని అన్నారు. ఈ ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లతో 164 అసెంబ్లీ సీట్లు, 21 పార్లమెంట్ సీట్లు సాధించామని అన్నారు. ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేసారు. 

ఏపీలో 93శాతం స్ట్రెక్ రేట్, 57 శాతం ఓట్లతో గెలిచాం. భవిష్యత్‌లోనూ ఈ కాంబినేషన్ ఏపీలో ఉంటుంది. pic.twitter.com/q1w0E95JMj

— Telugu Desam Party (@JaiTDP)

 

పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అద్భుత విజయాన్ని సాధించి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత కూడా హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిందన్నారు. ఇది మోదీ చరిష్మా వల్లే సాధ్యమయ్యిందన్నారు. 'రాసిపెట్టుకోండి... డిల్లీలో కూడా గెలవబోయేది ఎన్డిఏనే' అంటూ చంద్రబాబు జోస్యం చెప్పారు. 

సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ నినాదంతో మోదీ ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకు వెళుతోందని పేర్కొన్నారు. ఇలా అభివృద్దిలో దూసుకుపోతున్న దేశం 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానం ఉంటుందన్నారు. ఇది వేరేవారికి సాధ్యం కాదు... మోదీకే సాధ్యమన్నారు. 

అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేస్తున్నారు ప్రధాని మోదీ... ఆయన వల్లే ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ బ్రాండ్ గా అది మారిందన్నారు. మీనుండి చాలా పాఠాలు నేర్చుకున్నాను... మనిద్దరిది సేమ్ స్కూల్ అంటూ ప్రధానితో అన్నారు చంద్రబాబు. మీరు బ్రాండ్ ఆఫ్ ఇండియా ... లోకల్ లీడర్ కాదు గ్లోబల్ లీడర్ అంటూ మోదీని కొనియాడారు చంద్రబాబు. ఎన్డిఏ బలంగా వుంటేనే భారత్ బలంగా వుంటుంది... డబుల్ ఇంజన్ సర్కార్ లో డబుల్ డిజిట్ గ్రోత్ వుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. 

 

click me!