త్వరలో పెళ్లి.. ఆ విషయంలో కొడుక్కి తల్లి ట్రైనింగ్.. ట్విట్టర్ లో ప్రశంసలు
తన కొడుకు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని.. ఆమె ముందుగా రాబోయే కోడలు ఇబ్బంది పడకూడదని భావించింది. అందుకే.. కొడుకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. కాగా.. ఆ తల్లి చేసిన ప్రయత్నానికి ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
పెళ్లి అనగానే... ముందుగా అమ్మాయిల్లో కంగారు మొదలౌతుంది. తాము వెళ్లే అత్తగారి ఇంట్లో పద్దతులు, అలవాట్లు ఎలా ఉంటాయో.. వాటికి తాను సర్దుకోగలనో లేదో అని చాలా మంది భయపడిపోతారు. ఇక అమ్మాయి పెళ్లి అనగానే.. తల్లిదండ్రులు కూడా భయపడిపోతారు. ముందు నుంచే..కూతురికి వంట, వార్పు అంటూ అన్నీ నేర్పించేయాలని తపనపడతారు. రేపు పెళ్లి తర్వాత మీ అమ్మాయికి ఏం నేర్పారు అనే ప్రశ్న ఎక్కడ అడుగుతారో అని ముందునుంచే భయపడిపోతారు.
అందుకే ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే ముందునుంచే అన్నీ నేర్చుకోవాలంటూ ప్రతి ఒక్కరూ ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అయితే... ఇది కేవలం ఆడపిల్లలకే ఎందుకు వర్తించాలి.. అబ్బాయి లకు కూడా అవసరేమనని చెప్పింది ఓ తల్లి.
తన కొడుకు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని.. ఆమె ముందుగా రాబోయే కోడలు ఇబ్బంది పడకూడదని భావించింది. అందుకే.. కొడుకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. కాగా.. ఆ తల్లి చేసిన ప్రయత్నానికి ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
చాలా మందికి వంట చేయడం వచ్చినా.. పప్పుల విషయంలో తికమకపడుతూనే ఉంటారు. ఇక కిచెన్ వంక చూడని వారికైతే.. వాటిని చెప్పడం కష్టమే. అందుకే.. ఆమె తన కొడుక్కి ఈ విషయంలో అర్థమయ్యేలా నేర్పించింది.
ఓ పేపరు మీద పప్పు దినుసుల పేర్లు రాసి.. ఆ పప్పులను ఓ కవర్ లో ఏర్పాటు చేసి.. వాటిని ఆ పేపరుకి అంటించి మరీ కుమారుడికి ఇచ్చింది. కాగా.. ఆ పేపర్ ని ఫోటో తీసి.. ఓ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.
ఆ తల్లి చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు విపరీతంగా మెచ్చుకుంటున్నారు. పెళ్లికి ముందు ఇలాంటి ట్రైనింగ్ ఆడపిల్లలకు మాత్రమే కాదు.. మగపిల్లలకు కూడా అవసరమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్క తల్లి.. ఈ విషయంలో తమ కొడుకులకు ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ లో అందరూ పేర్కోనడం గమనార్హం.