సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వస్తున్న తాజా చిత్రం మర్డర్‌. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య ప్రణయ్‌ హత్యోదంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. 

ప్రణయ్‌ హత్య ఆ తరువాత ప్రణయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృతకు ఎదురైన అనుభవాలను, ప్రణయ్‌ హత్యకు దారి తీసిన సంఘటనలు, ఈ నేపథ్యంలో అమృత తండ్రి మానసిక సంఘర్షణ ఇలా అనే కోణాలను తన సినిమాలో ఆవిష్కరించనున్నాడు వర్మ.

లాక్ డౌన్‌ సమయంలో వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తూ హల్‌ చల్‌ చేస్తున్న వర్మ తాజాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఏటీటీలో కాకుండా, ఓటీటీ ప్లాట్‌ ఫాంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వర్మ ఇటీవల ప్రకటించాడు. 

తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్‌తో మరోసారి తన మార్క్‌ చూపించాడు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వర్మ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి డైలాగ్స్‌ లేకపోయినా దాదాపు సినిమా కథ అంతా ట్రైలర్‌లోనే రివీల్ చేశాడు వర్మ. ట్రైలర్‌తో సమాజానికి చాలా ప్రశ్నలను సందించాడు వర్మ.

కాగా.. ఈ మర్డర్ సినిమాలో అమృత పాత్రలో సాహితి అవంచ అనే యువతి నటిస్తోంది. కాగా.. ఈమె హైదరాబాద్ కు చెందిన అమ్మాయేనట. సాహితిని హీరోయిన్ గా చూడాలి అనేది ఆమె తల్లి కోరికట. అందుకే బుల్లితెరపై కొన్ని షోస్ చేసే అవకాశం సాహితికి దక్కేలా చేసిందట. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిందట సాహితి. అంతేకాదు.. ’బాయ్’ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా చేసింది. ఇప్పుడు మర్డర్ సినిమాలో చేస్తోంది. ఈ సినిమాతో సాహితికి కచ్చితగా క్రేజ్ రావడం ఖాయమని తెలుస్తోంది.