కోల్ కతా: నందిగ్రామ్ దాడిలో గాయపడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు పలు చోట్ల గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్ కేఎం ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. 

ఎడమ చీలమండ, కాలు, కుడి భుజం, ముంజేయి, మెడలపై తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు బుధవారం రాత్రి మెడికల్ బులిటెన్ విడుదల చేశాయి. మమతా బెనర్జీకి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. 

ఛాతీ నొప్పి వస్తున్నట్లు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతున్నట్లు 66 ఏళ్ల మమతా బెనర్జీ డాక్టర్లకు చెప్పారు. ఆమెను 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో పెట్టనున్నట్లు వైద్యులు తెలిపారు. కార్డియోలాజిస్టు, ఎండో క్రైనాలిజిస్ట్, జనరల్ సర్జరీ డాక్టర్, ఆర్థోపెడిస్టులతో కూడిన వైద్య బృందం జాగ్రత్తగా ఆమె ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది. 

నందిగ్రామ్ ప్రచారంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై బుధవారంనాడు దాడి చేశారు. బిజెపి కుట్రలో బాగంగానే తనపై దాడి జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. దాడి జరిగిన వెంటనే ఆమె పర్యటనను రద్దు చేసుకున్నారు. 

మమతా బెనర్జీని పరామర్శించడానికి వచ్చిన గవర్నర్ జగదీప్ ధంఖార్ కు ఆస్పత్రి వద్ద వ్యతిరేకత ఎదురైంది. గో బ్యాక్ అంటూ వందలాది మంది కార్యకర్తలు నినాదాలు చేశారు.