దేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తాను పాల్గొనవలసిన అన్ని బహిరంగ సభలను రాహుల్ రద్దు చేసుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి సంబంధించి భారీ బహిరంగసభల ఏర్పాటు వల్ల తలెత్తే పరిణామాలను ఆలోచించాలని ఇతర రాజకీయ నాయకులను ఆయన కోరారు. 

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో 6వ, 7వ, 8వ దశల పోలింగ్‌కు ముందు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలను సస్పెండ్ చేసినట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇదే విధంగా సభలను రద్దు చేయడంపై ఆలోచించాలని ఇతర రాజకీయ పార్టీల నేతలను కూడా కోరుతున్నానని తెలిపారు. 

దేశంలో సెకండ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో భారీ బహిరంగ సభల్లో పాల్గొంటుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మోడీ భారీ బహిరంగ సభలను నిర్వహిస్తుండటం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆరోపించారు.