రాజకీయాలపై ఇంట్రెస్ట్ చాలా మందికి వుంటుంది. ఎన్నికల్లో పోటీ చేయాలని వున్నా ఛాన్స్ రాక వెయిట్ చేస్తూ వుంటారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రకటించిన లిస్ట్‌లో తన పేరు ఉండటంపై ఓ మహిళా నేత మండిపడ్డారు.

తనను అడగకుండా అభ్యర్ధిగా ఎందుకు ప్రకటించారంటూ ఫైరయ్యారు. వివరాల్లోకి వెళితే.. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి.

అధికారం నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్, దీదీ కోటను బద్ధలు కొట్టాలని బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో సత్తా ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి.

ఇక బీజేపీ గురువారం అభ్యర్థుల రెండవ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో తన పేరు ఉండటంపై దివంగత కాంగ్రెస్‌ నేత సోమెన్‌ మిత్ర భార్య శిఖా మిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే కోల్‌కతా చౌరింఘీ నియోజకవర్గ అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని శిఖా పేర్కొన్నారు.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని.. అలాంటిది నన్ను సంప్రదించకుండానే నా పేరును ఎలా ప్రకటిస్తారంటూ శిఖా ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరటం లేదని తేల్చి చెప్పారు. 

కాగా, కొద్దిరోజుల క్రితం బీజేపీ నేత సువేంధు అధికారితో శిఖా మిత్ర భేటీ అయిన నేపథ్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారంటూ ప్రచారం జరిగింది.  ఈ నేపథ్యంలో శిఖా ప్రకటనతో అవన్నీ ఒట్టి పుకార్లేనని తేలింది. దానికి తోడు అభ్యర్థి సమ్మతం లేనిదే పేరు ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం అధికార టీఎంసీకి బ్రహ్మాస్త్రంగా మారింది.