కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దామ్‌జూర్‌లో జరిగిన బహిరంగ సభలో దీదీ పాల్గొన్నారు
కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దామ్‌జూర్‌లో జరిగిన బహిరంగ సభలో దీదీ పాల్గొన్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. నందిగ్రామ్ ముస్లింలను పాకిస్తానీలంటూ వ్యాఖ్యానించిన ఎందరిపై కేసులు నమోదు చేశారో చెప్పాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అలా వ్యాఖ్యానించడానికి వారికి సిగ్గులేదా? అంటూ పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు.
తనకు వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరని, అన్ని వర్గాల వారికీ అండగా నిలుస్తానని మమత స్పష్టం చేశారు. తనకు 10 షోకాజ్ నోటీసులు జారీ చేసినా, లెక్కచేసే ప్రసక్తే లేదని దీదీ తేల్చి చెప్పారు.
హిందూ, ముస్లింలంటూ ప్రధాని మోడీ రోజూ ప్రచారంలో వ్యాఖ్యానిస్తారని, అలాంటప్పుడు ఆయనపై ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యాయో చెప్పాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
అంతకుముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా మమత.. తారకేశ్వర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘దుష్టశక్తుల మాటలు విని, మీ ఓట్లను చీల్చుకోవద్దని మైనారిటీ సోదరసోదరీమణులను కోరుకుంటున్నానంటూ వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా సీపీఎం, బీజేపీ నేతలు మీ ఓట్లను చీల్చడానికి డబ్బులతో దిగుతారంటూ దీదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం మమత బెనర్జీకి నోటీసులు జారీ చేసింది.
