పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు.
గురువారం తూర్పు మిడ్నాపూర్, అమ్లాసులి తదితర చోట్ల ప్రచారంలో పాల్గొన్న టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను పులి లాంటిదాన్నని, ప్రజల ముందు తప్ప ఎవరికీ తలవంచబోనని ఆమె స్పష్టం చేశారు.
బీజేపీ పార్టీ మహిళలను, దళితులను హింసిస్తోందని దీదీ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే హెలికాప్టర్లు, విమానాల్లో దిగి ఓటర్లను ప్రలోభపెట్టి ఆకర్షించేందుకు బీజేపీ నేతలు వస్తారని, సంక్షోభాల సమయంలో వారెక్కడా కనబడరని ఆమె ఎద్దేవా చేశారు.
అంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం తమ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చుచేసిందని మమత గుర్తుచేశారు. ఆ సమయంలో ఒకటి రెండు తప్పులు జరిగి ఉండొచ్చనీ.. కానీ ప్రజల కోసం తాము పరుగులు పెట్టి పనిచేశామని ఆమె స్పష్టం చేశారు.
ఆ సమయంలో బీజేపీ ఎక్కడ ఉందని దీదీ ప్రశ్నించారు. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను రాష్ట్రంలో అనుమతించేది లేదని మమత స్పష్టం చేశారు. ఎన్యుమరేటర్లు వచ్చే సమయంలో ఇంట్లో లేని వ్యక్తులను ఓటర్లుగా బీజేపీ తీసేస్తుందని సీఎం ఆరోపించారు.
మరోవైపు, ఈ రోజు బెంగాల్‌లోని పురూలియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. మమత టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో ఆట మొదలైందని దీదీ చెబుతున్నారని.. కానీ బీజేపీ మాత్రం అభివృద్ధి మొదలైందని అంటోందని ప్రధాని వ్యాఖ్యానించారు. టీఎంసీ అంటే ట్రాన్స్‌ఫర్ మై కమిషన్ పార్టీ అని ప్రధాని మోడీ సెటైర్లు వేశారు.
