పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార బరిలోకి దిగాయి. ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. నిన్న ప్రధాని మోడీ కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టి ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

తాజాగా నేడు దీదీ సైతం అదే స్థాయిలో మోడీ విమర్శనాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోల్‌కతాలో దీదీ పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తృణమూల్‌ ప్రభుత్వంపై ప్రధాని అసత్య ప్రచారం చేస్తున్నారని మమత దుయ్యబట్టారు. ఈ దేశానికి కూడా మోడీ పేరు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదంటూ సెటైర్లు వేశారు.

బీజేపీ నేతలు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే బెంగాల్‌కు వస్తారన్న ఆమె.. తృణమూల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళల భద్రత గురించి మోడీ ఉపదేశాలు ఇస్తున్నారని.. బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదని ఆరోపిస్తున్నారంటూ మండిపడ్డారు.

కానీ బీజేజీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో మహిళల పరిస్థితి ఏంటీ? అక్కడ కనీసం ఆడవాళ్లు రాత్రిపూట స్వేచ్ఛగా బయటకు వెళ్లలేరంటూ దీదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆదర్శ రాష్ట్రంగా చెబుతున్న గుజరాత్‌లో గత రెండేళ్లుగా రోజుకు నాలుగు అత్యాచారాలు, రెండు హత్యలు జరుగుతున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నట్లు మమతా బెనర్జీ ప్రస్తావించారు. మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందు ఆ రాష్ట్రాలపై దృష్టిపెడితే బాగుంటుందంటూ దీదీ హితవు పలికారు.

ఇకపోతే కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రాలపై మోడీ ఫొటో ఉండటాన్ని మమత తప్పుబట్టారు. దేశానికి కూడా మోడీ పేరు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదంటూ కామెంట్ చేశారు. ఈసారి బెంగాల్‌లో పోటీ దీదీ.. బీజేపీ మధ్యేనని అయితే టీఎంసీ హ్యాట్రిక్ సాధిస్తుందని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.