పశ్చిమబెంగాల్‌తో పాటు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న నందిగ్రామ్‌లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో స్థానికంగా ఓ బీజేపీ కార్యకర్త గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

నందిగ్రామ్‌లోని బేకుటియా ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త ఉదయ్ దూబే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయ్ దూబే.. సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్ షో కు హాజరైన తర్వాత టీఎంసీ నుంచి బెదిరింపులు రావడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది.

ఇతని ఆత్మహత్యకు టీఎంసీనే కారణమని కాషాయ నేతలు ఆరోపిస్తున్నారు. కీలకమైన నందిగ్రామ్‌ సహా రాష్ట్రంలోని 30 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, పలు చోట్ల టీఎంసీ, బీజేపీ కార్యకర్తల వాగ్వాదంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కేశాపూర్‌లో బీజేపీ పోలింగ్‌ ఏజెంట్‌పై తృణమూల్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పోలింగ్‌ ఏజెంట్‌ను ఆసుపత్రికి తరలించారు.

ఇదే ప్రాంతానికి చెందిన బీజేపీ నేత తన్మయ్‌ ఘోష్‌ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక దేబ్రా నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.