విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుగు తమ్ముళ్లు షాక్ లపై షాక్ లు ఇస్తున్నారు. వల్లభనేని వంశీమోహన్, దేవినేని అవినాష్ లు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే చంద్రబాబునాయుడుకు మరో షాక్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. 

చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగా ఇసుక దీక్షకు దిగారు. ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు దీక్ష చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు అంటే 12గంటల పాటు దీక్ష చేశారు. 

ఈ దీక్షకు అన్ని పార్టీల మద్దతు కోరారు. అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ మద్దతు ప్రకటించింది కానీ దీక్షలో పాల్గొనలేదు. లోక్ సత్తా పార్టీ నుంచి భీశెట్టి బాబ్జీ, జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆమ్ ఆద్మిపార్టీ నేతలతో సహా పలు పార్టీల నేతలు చంద్రబాబు దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. 

ఇతర పార్టీల నుంచి నేతలు దీక్షకు సంఘీభావం ప్రకటించినా టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. చంద్రబాబు చేసిన 12 గంటల దీక్షలో కేవలం తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. దీక్ష చేసిన చంద్రబాబును కలుపుకుంటే మెుత్తం 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని తెలుస్తోంది. అంటే 13 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని సమాచారం. 
 
విజయవాడలో చేపట్టబోతున్న ఇసుక దీక్ష అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ఈ దీక్షలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆదేశాలను 13 మంది ఎమ్మెల్యేలు ఖాతరు చేయలేదు. 

ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ టీడీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన హాజరుకారని అంతా ఊహించారు. దీక్షకు వంశీ హాజరవుతారని కూడా చంద్రబాబు అనుకోరు.  వంశీని తీసెయ్యగా మిగిలిన 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు హాజరుకాలేదన్నదానిపైనా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. దీక్ష ఉందని దాదాపు 20 రోజులు ముందుగానే ప్రకటించినప్పటికీ ఎందుకు ఎమ్మెల్యేలు హాజరుకాలేదనే అంశంపై టీడీపీలో జోరుగా చర్చ జరుగుతుంది.  

ఇకపోతే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లాలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు దీక్షలో కనుచూపు మేరలో కనబడలేదు. ఇప్పటికే పార్టీకి దూరంగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతోపాటే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారా అన్న చర్చ జరుగుతుంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు గంటాతోపాటు టీడీపీకి గుడ్ బై చెప్తారా అన్న కోణంలో చర్చ  జరుగుతుంది.  

మరోవైపు ప్రకాశం జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయులు, గొట్టిపాటి రవికుమార్ లు కూడా సభలో ఎక్కడా కనిపించలేదని తెలుస్తోంది. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ లు పార్టీ మారతారంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అందువల్లే హాజరు కాలేదా లేక వేరే కారణాలు ఉన్నాయా అన్న కోణంలో టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. 

ఇకపోతే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణలు సైతం హాజరుకాలేదు. రూలర్ సినిమాలో హీరో బాలకృష్ణ బిజీబిజీగా గడుపుతున్నారు. డిసెంబర్ నెలలోనే సినిమా విడుదల  కానున్న నేపథ్యంలో షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు.  

ఇకపోతే చంద్రబాబు నాయుడు ఇసుక దీక్షలో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్పలు మాత్రమే సభావేదికపై హల్ చల్ చేశారు. సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి స్టేజ్ పై హల్ చల్ చేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం ఇసుక దీక్ష వేదికపై వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఇతర పార్టీల నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించి ప్రభుత్వంపై విమర్శలు చేసినా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడంపై టీడీపీకి మింగుడుపడటం లేదు. అధినేత దీక్షకే గైర్హాజరైతే భవిష్యత్ లో పార్టీ పరిస్థితి ఏంటంటూ పసుపు శిబిరంలో చర్చ జరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

మీ కళ్లు గద్దలు పొడవా, పౌరుషమున్న సీఎంవైతే... :జగన్ పై దివ్యవాణి ఫైర్

దొంగ దీక్షలు చేయడంలో చంద్రబాబు దిట్ట...ఆళ్ల ఫైర్

జూ.ఎన్టీఆర్‌తో పోలికా, ఉన్న పళ్లు ఊడిపోతాయి: బాబుపై వంశీ ఘాటు వ్యాఖ్యలు

జూ.ఎన్టీఆర్ ది ముగిసిన కథ, వంశీ నీకు సిగ్గుందా: నారా లోకేష్ ధ్వజం..

అమ్మాయిలతో కలిసున్న ఫోటోలతో ప్రచారం... పోలీస్ కమీషనర్ కు వంశీ ఫిర్యాదు