అమరావతి: పరువు కాపాడుకొనేందుకే తనను టీడీపీ నుండి సస్పెండ్ చేశారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు.గతంలో కూడ సస్పెండ్ చేసి తర్వాత ఎంపీ టిక్కెట్టు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 

శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు మీడియా ఛానెల్‌తో  వల్లభనేని వంశీ ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజీనామా చేసిన తర్వాత నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశామని ప్రకటించడంలో అర్ధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. 

మీడియాలో వార్తల కోసమే చంద్రబాబునాయుడు ఈ పని చేశాడని వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. తనలాంటి నలుగురిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే  చంద్రబాబునాయుడు ఇంటి వద్ద పోలీస్ ఔట్ పోస్టు కూడ ఉండదని వంశీ చెప్పారు. చంద్రబాబునాయుడు తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో  తేల్చుకోవాలని  వల్లభనేని వంశీ సూచించారు.

చంద్రబాబునాయుడు తనను తాను ఎక్కువ ఊహంచుకోకుండా  తక్కువ మాట్లాడాలని వల్లభనేని వంశీ హితవు పలికారు.నన్ను చంద్రబాబునాయుడు సస్పెండ్ చేసే ధైర్యం లేదు, ఆయనకు అంత సీన్‌ లేదని ఆయన ఎద్దేవా చేశారు.

తన గురించి కొన్ని వెబ్‌సైట్లలో లోకేష్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వల్లభనేని వంశీ చెప్పారు. వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో ప్రచారం వల్ల రాజ్యాధికారం వస్తోందని లోకేష్ భ్రమల్లో ఉన్నాడని వల్లభనేని వంశీ సెటైర్లు వేశారు.తన లాంటి వాళ్లు లోకేష్ వెంట తిరగరని ఆయన చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు నారా లోకేష్ కు  నక్కకు, నాకలోకానికి మధ్య తేడా ఉందన్నారు. లోకేష్‌కు  వర్ధంతికి, జయంతికి కూడ తేడా తెలియదన్నారు.లోకేష్‌ను  కుటుంబంలో రుద్దితే సరిపోతుంది,  పాలు, పెరుగు అమ్ముకొనేందుకు వాళ్ల కంపెనీలో రుద్దితే సరిపోయేది, కానీ మా మీద రుద్దాలని ప్రయత్నించారని వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో ఎంతమందికి చంద్రబాబునాయుడు టిక్కెట్లు ఇచ్చారు, ఎందరు గెలిచారనే విషయమై ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు తన కొడుకు లోకేష్‌ను ఎందుకు గెలిపించుకోలేకపోయారో చెప్పాలన్నారు.

నేను రాజీనామా చేస్తే పళ్లు పటపట కోరకడం తప్ప చంద్రబాబునాయుడు ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. పల్లు పట పట కొరికితే చంద్రబాబు ముసలి పళ్లు ఊడిపోతాయని వంశీ వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు హుంకరింపులు, బెదిరింపులు ఎన్నో చూశామన్నారు.

రాజ్యసభలో నలుగురు ఎంపీలు టీడీపీని వీడీ బీజేపీలో చేరారు. చంద్రబాబునాయుడు ఎందుకు నోరు తెరవడం లేదని ఆయన ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా మీద చంద్రబాబునాయుడు నల్ల బట్టలు వేసుకొని  ధర్నా చేయగలరా అని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ నుండి మరికొందరు ఎమ్మెల్యేలు కూడ టీడీపీని వీడి వైసీపీలో చేరే అవకాశం ఉందన్నారు. వైసీపీలో చేరేందుకు వ్యక్తిగతంగా మాట్లాడుకొంటున్నారని వారి పేర్లను  చెప్పడం తనకు ఇష్టం లేదన్నారు. సమయం వచ్చినప్పుడు వైసీపీలో చేరే టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు బయటకు వస్తాయన్నారు.

ఈ వార్తలు చదవండి

జూ.ఎన్టీఆర్ ప్రస్తావన ఇప్పుడెందుకు, వంశీ నీకు సిగ్గుందా: నారా లోకేష్ ధ్వజం

బాబుపై తీవ్ర వ్యాఖ్యలు: టీడీపీ నుండి వల్లభనేని వంశీ సస్పెన్షన్.

చంద్రబాబు ఇసుక దీక్షకు ఎమ్మెల్యేల ఝలక్ : ఏమవుతోంది...?

నోరు మూసుకుని కూర్చోలేను, వంశీపై చర్యలు తీసుకుంటా: స్పీకర్ తమ్మినేని సీతారాం..