ఒంగోలు: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆస్తులను కాపాడుకునేందుకే వంశీ పార్టీ మారుతున్నాడంటూ విరుచుకుపడ్డారు. భూ వివాదం కారణంగానే వైసీపీలోకి వెళ్తున్నారంటూ స్పష్టం చేశారు. 

ఒంగోలులో పర్యటిస్తున్న నారా లోకేష్ ఎమ్మెల్యే వంశీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంశీమోహన్ కు సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. ఉపఎన్నికల్లో ఓడిపోతాడనే భయంతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడుతున్నారంటూ విరుచుకు పడ్డారు. 

జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం ప్రస్తావన తేవడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో జూ.ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం చేశారని ఆ విషయం ఇప్పుడెందుకని ఎమ్మెల్యే వంశీని నిలదీశారు. 10ఏళ్ల క్రితంనాటి అంశాలను తీసుకువచ్చి లేనిపోని విమర్శలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 

వంశీలాంటి నాయకులు తెలుగుదేశం పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం ఏమీ ఉండదన్నారు. వారం రోజుల క్రితం తనతో మాట్లాడి ఇప్పుడు తనపైనే విమర్శలు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. 

వంశీ ఆరోపిస్తున్న వెబ్ సైట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆ వెబ్ సైట్ల గురించి తనకు తెలియదన్నారు. నిన్న మెున్నటి వరకు జగన్ ను తిట్టిన వల్లభనేని వంశీ ఇప్పుడు ఆయన పార్టీలోకే చేరుతున్నారంటూ సెటైర్లు వేశారు నారా లోకేష్. 

అంతకుముందు వల్లభనేని వంశీపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబు, నారా లోకేష్ లపై వంశీ చేసిన వ్యాఖ్యలపట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో వంశీని పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బాబుపై తీవ్ర వ్యాఖ్యలు: టీడీపీ నుండి వల్లభనేని వంశీ సస్పెన్షన్.

చంద్రబాబు ఇసుక దీక్షకు ఎమ్మెల్యేల ఝలక్ : ఏమవుతోంది...?

నోరు మూసుకుని కూర్చోలేను, వంశీపై చర్యలు తీసుకుంటా: స్పీకర్ తమ్మినేని సీతారాం..