విశాఖ టిడిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత... టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య తోపులాట
విశాఖపట్నం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నగరంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కార్యకర్తలు ఒక్కచోటికి చేరుకుని బాహాబాహీకి దిగడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
విశాఖపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధానిని విశాఖకు రాకుండా అడ్డుకుంటున్న టిడిపి వ్యవహారశైలికి నిరసనగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తును టిడిపి కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. దీనికి వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని విశాఖ టిడిపి కార్యాలయం ఎదుటే వైసిపి నాయకులు చేపట్టారు. అంతేకాకుండా చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే వెలగనపూడి తమ పదవులకు రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వీరితో టిడిపి ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
read more మరో కీలక నిర్ణయం దిశగా జగన్... త్వరలో ప్రభుత్వ ప్రకటన: ఎమ్మెల్యే గోపిరెడ్డి
టిడిపి కార్యాలయం ఎదుట వైసిపి కార్యకర్తలు ధర్నాకు దిగి కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న టిడిపి శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. వైసిపి నిరసనలకు దీటుగా వారు కూడా సీఎం జగన్, స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్ దిష్టిబిమ్మలను దహనం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలు భారీగా ఒకేచోటికి చేరుకుని నిరసనలు చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సర్దిచెప్పారు. అయినప్పటికి వారు వినకపోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు వైసిపి శ్రేణులను అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
read more ఆ నగరం దేశ రాజధానిగా ఓకే... రాష్ట్ర రాజధానిగా మాత్రం పనికిరాదట...: ఏపి డిప్యూటీ సీఎం
ఈ నిరసనలపై టిడిపి నాయకులు స్పందిస్తూ... ప్రశాంతంగా వుండే విశాఖపట్నంలో వైసిపి చిచ్చు పెడుతోందని ఆరోపిస్తున్నారు. రాజధాని రాకముందే పరిస్థితి ఇలా వుంటే రేపు వచ్చాక వీరి ఆగడాలు మరీ ఎక్కువ అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.