విశాఖఫట్నం: తెలుగు సాహిత్య వికాసంలో విశేష కృషి చేసిన ఎమెస్కో సంస్థ అధినేత దూపాటి విజయ్ కుమార్ కు, విద్యారంగంలో సేవలందిస్తున్న విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య లు ఈ ఏడాది విశిష్ట అవార్డును  అందుకోనున్నారు.  వారిద్దరిని లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డులతో సత్కరిస్తున్నట్లు పద్మభూషణ్, లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలియజేశారు. 

శుక్రవారం స్వగృహంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ...  లోక్ నాయక్ ఫౌండేషన్ 16వ వార్షిక పురస్కార ప్రధానోత్సవాన్ని రేపు(శనివారం) నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు విశాఖలోని సిరిపురం విఎంఆర్డిఏ చిల్డ్రన్ థియేటర్లో ఈ  కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోనే రత్తయ్య, విజయ్ కుమార్ లకు అవార్డులు బహుకరణ చేయనున్నట్లు వెల్లడించారు. 

read more  జగన్ నోటినుండే అది రావాలి....అప్పటివరకు...: నారా లోకేశ్ హెచ్చరిక

దివంగత నేత డాక్టర్ బెజవాడ గోపాల కృష్ణ స్ఫూర్తితో తెలుగు సాహిత్య వికాసంలో విశేష కృషి చేస్తున్న పెద్దల్లో ఒకరిని ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయల నగదు పురస్కారంతో సత్కరించాలని తమ సంస్థ నిశ్చయించిందన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు, హరివంశ్ రాయ్ బచ్చన్ స్మారక గుర్తుగా విశాఖలో 2005 నుంచి ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఆంధ్ర జ్ఞానపీఠ అవార్డుగా ప్రసిద్ధి చెందిన లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డులను ఇచ్చి ఇప్పటివరకు 16 మంది తెలుగు సాహితీవేత్తలను సత్కరించినట్లు తెలియజేశారు. ఈ ఏడాది తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ఎమెస్కో ప్రచురణ సంస్థ అధినేత ధూపాటి విజయ్ కుమార్ కు రెండు లక్షల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను బహుకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విద్యారంగంలో విశేష కృషి చేసిన విజ్ఞాన్ సంస్థ అధినేత డాక్టర్ లావు రత్తయ్య కు లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక తో పాటు జీవన సాఫల్య పురస్కారం ప్రధానం చేస్తున్నట్లు తెలిపారు. 

read more  వారిసాయం లేకుండా రాజధాని మార్పు అసాధ్యం: జేఏసి ఛైర్మన్

అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఆత్మీయ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.వి.శేష సాయి, సుప్రసిద్ధ సినీ నటులు డాక్టర్ మంచు మోహన్ బాబు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నాట్య ఆచార్యులు, కళారత్న కె. వి. సత్యనారాయణ సారథ్యంలో “కావ్య నాయకలు” నృత్య రూపకం ప్రదర్శన ఉంటుందని తెలిపారు.