మంగళగిరి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి మూడు రాజధానులు వద్దు అనే ప్రకటన వెలువడేవరకు అమరావతి ప్రజలతో కలిసి తాము చేపడుతున్న ఉద్యమం ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాజధానిని వికేంద్రీకరణ చేస్తే అభివృద్ధి ఏవిధంగా జరుగుతుందో ఆయనే చెప్పాలన్నారు. అమరావతి నుండి రాజధానిని తరలించాలన్న నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తేలేదని లోకేశ్ స్పష్టం చేశారు.  

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రా జేఎసి ఆధ్వర్యంలో జరిగిన  బైక్ ర్యాలీలో లోకేశ్ పాల్గొన్నారు. అమరావతినే ఏపి రాజధానిగా  కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సాగిన ఈ ర్యాలీలో భారీసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై విరుచుకుపడ్డారు. 

read more  వారిసాయం లేకుండా రాజధాని మార్పు అసాధ్యం: జేఏసి ఛైర్మన్

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తామూ కోరుకుంటున్నామని అయితే అది రాజధాని మార్పువల్ల మాత్రమే సాధ్యం కాదని సీఎం తెలుసుకోవాలని  అన్నారు. అమరావతి లో తాము ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నా ఇప్పటి వరకు నిరూపించలేకపోయారని అన్నారు.  

రాజధాని కోసం రైతులు ప్రాణాలు త్యాగం చేశారని... అయితే ఈ ప్రాణ త్యాగాల్ని కూడా వైసీపీ నాయకులు అవహేళన చేయటం తగదన్నారు. ఇకనైనా ఇలాంటి మాటలను ఆపేసి ఆ  త్యాగాలకు సరయిన గౌరవం ఇవ్వాలన్నారు. ఈ బైక్ ర్యాలీలో లోకేశ్ తో పాటు సీపీఐ నారాయణ, జేఏసీ నేతలు, భారీ స్ధాయిలో ప్రజలు  పాల్గొన్నారు.