గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇసుక మాఫియా లీలల గురించి, నిత్యం ప్రసారమాధ్యమాలన్నీ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా వెల్లడించాయని, తాజాగా విజయవాడ కేంద్రంగా ఆయన సాగిస్తున్న అవినీతి బాగోతాన్ని, అన్యాయాలను  రాష్ర్టమంతా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ విప్ కూన రవికుమార్ ఆరోపించారు. 

విజయవాడ నడిబొడ్డునున్న దాసాంజనేయ దేవస్థానంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో అర్చకుల నియామకం కోసం ఒక పత్రికా ప్రకటన జారీచేయగా 12మంది దరఖాస్తు చేసుకున్నారన్నారని తెలిపారు. అయితే ఆ నియామక ప్రక్రియను కూడా అవినీతిమయం చేసేలా స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇతర వైసీపీనేతలు వ్యవహరించడం సిగ్గుచేటని కూన మండిపడ్డారు. 

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అర్చకుల నియామక ప్రక్రియలో అతి ముఖ్యమైన నిబంధన అయిన పంచరాత్ర సర్టిఫికెట్ ఉన్నవారే అర్చకత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ఆనాడే చెప్పడం జరిగిందన్నారు. దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న జీ. అనంత్ అనే వ్యక్తి కుమారుడు పంచరాత్రకు బదులుగా పంచరత్న అనే ధృవీకరణ పత్రం తీసుకొస్తే, అతన్ని అర్చకుడిగా నియమించమని సదరు శాఖాధికారులపై అధికారులపై తమ్మినేని, దేవాదాయశాఖలోని కొందరు ప్రదానాధికారులు ఒత్తిడి చేస్తున్నారని రవికుమార్ తెలిపారు. 

more news  మహిళ నడుమును తడుముతూ... ఎంపీ సురేశ్, అనుచరుల దాష్టికం..: వర్ల రామయ్య

పంచరాత్ర అనే శాస్త్రాన్ని పూర్తిచేసి ఉత్తీర్ణులైన వారినే అర్చకులుగా నియమించాలన్న నిబంధన ఉన్నప్పటికీ దాన్ని వదిలేసి, దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చిన వ్యక్తికి అర్చకత్వ బాధ్యతలు అప్పగించాలని చూడటం ఎంతవరకు సమంజసమన్నారు. అదే అర్చకత్వ ఉద్యోగానికి గతంలో దరఖాస్తు చేసుకున్న శ్రావణ్ కుమార్ భట్టార్ అనే వ్యక్తి టీడీపీ ప్రభుత్వంలో అర్చక నియామక ప్రక్రియ కొలిక్కిరాకముందే తనకు అన్యాయం జరిగిందంటూ  2018లో హైకోర్టుకి వెళ్లాడని, దాంతో సదరు నియామకాలన్నీ నిలిచిపోయాయన్నారు. 

ఈ వ్యవహారం ఇలా ఉండగానే, తాజాగా సదరు దేవస్థానంలో తాను సూచించిన వ్యక్తికి అర్చకత్వ బాధ్యతలు అప్పగించాలని సూచిస్తూ స్పీకర్ తమ్మినేని లేఖ రాయడం జరిగిందన్నారు. తన అవినీతి సంపాదన కోసం దేవుడిని కూడా వదలకుండా అర్చకత్వానికి పనికిరాని వ్యక్తికి ఉద్యోగమివ్వాలని సూచిస్తూ తమ్మినేని దేవదాయశాఖ ఉన్నతాధికారికి లేఖరాయడం జరిగిందన్నారు. ( స్పీకర్ లేఖను రవికుమార్ విలేకరులకు చూపించారు) 

శ్రీకాకుళంలో ఇసుక, ఇతర ప్రకృతి వనరులను దోచేస్తున్న సీతారామ్ ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం పంచరాత్ర లో అర్హతలేని వ్యక్తిని అర్చకుడిగా నియమించాలని సూచించడం ద్వారా దాదాపు అరకోటి రూపాయలవరకు నొక్కేశాడన్నారు. దొంగ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తిని సిఫారసు చేయడంద్వారా ఎన్నిలక్షలకోట్లు చేతులు మారాయో దానివెనుక ఎవరున్నారో ముఖ్యమంత్రి విచారణ జరిపించాలన్నారు. 

read more  చంచల్ గూడానా, ఎడారి జైలా...లేక జగన్ గతి పావురాల గుట్టేనా..: బుద్దా వెంకన్న

తానుచేయలేదని దబాయించాలని సీతారామ్ చూసినా ఆయనిచ్చిన లేఖమాత్రం అబద్ధం చెప్పదన్నారు. శ్రీకాకుళంలో సాగుతున్న తన అవినీతిని, విజయవాడకు స్పీకర్ వ్యాపింపచేశాడని, ఈ వ్యవహారంలో వైసీపీనేత మల్లాది విష్ణు, ఇతర నేతల ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. దేవదాయశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడలోనే ఇలా జరిగితే, ఆయనపాత్రను కూడా సందేహించాల్సి వస్తోందన్నారు. 

తమ్మినేని తన అవినీతిని రాష్ర్ట వ్యాప్తం చేశాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి ఉండబోదని... అర్చక నియామక ప్రక్రియ వ్యవహారం కోర్టులో ఉన్నాకూడా లెక్కచేయకుండా ఏపక్షంగా నిర్ణయం తీసుకున్న తమ్మినేనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రవికుమార్ డిమాండ్ చేశారు.