గుంటూరు: అమరావతి ఉద్యమాన్ని అణచడకోసం జగన్ చేస్తున్న అనేక ప్రయత్నాలు రోజురోజుకీ నీరుగారి పోతుండటంతో ముఖ్యమంత్రి జగన్ దళిత అస్త్రాన్ని తెరపైకి తెచ్చి ఉద్యమంపైకి వదిలాడని... జగన్నన్న వదిలిన దళితబాణమైన సురేశ్ రాజధాని ఆందోళనకారులపైకి రివ్వున దూసుకొచ్చాడని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. 

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి ఉద్యమాన్ని అణచడానికి ఎంపీ సురేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని... ఏ ఎంపీ చేయనివిధంగా తన వాహనశ్రేణి, అనుచరులతో ఆందోళనలు జరిగే ప్రాంతంలో పదేపదే ఎందుకు కవాతులు చేస్తున్నాడో, ధర్నాలు చేస్తున్న టెంట్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు. 

ఉద్యమంలో మహిళల పాత్ర నానాటికీ పెరుగుతుండటంతో పాలుపోని స్థితికి చేరిన ముఖ్యమంత్రి ఉద్యమాన్ని నీరుగార్చడంకోసం సురేశ్ ను దళితబాణంగా మార్చి ప్రయోగించాడన్నారు.  సురేశ్ ఎంపీగా ఎన్నికైన తొలినాళ్లలో జగన్ కు అత్యంత సన్నిహితంగా మెదిలేవారని... తరువాత ఎంపీకి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ఒకటి సీఎం టేబుల్ పైకి చేరిందని, ఆనాటి నుంచీ వారిద్దరికీ మధ్యన అంతరం పెరిగిందన్నారు. తాజాగా అమరావతి ఉద్యమం ఉధృతమవుతుండటంతో దాన్ని అణచడంకోసం సురేశ్ ను పావుగా వాడుకోవడానికి జగన్ సిద్ధపడ్డాడని... ఆ క్రమంలోనే అమరావతి జేఏసీ మహిళల బస్సుపైకి ఆయన్ని ఉసిగొల్పాడని వర్ల దుయ్యబట్టారు. 

read more  చొక్కా పట్టి లాగి చెప్పులతో మహిళల దాడి... కారంపొడి చల్లి..: దాడిపై వైసిపి ఎంపీ వివరణ

గతంలో నందిగంలో సురేశ్ కు గులాబీ పువ్వులచ్చి అమరావతి ఉద్యమానికి మద్ధతు పలకాలని స్థానికులుకోరితే వారిపైన ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించాడన్నారు. తాజాగా అమరావతి అమరేశ్వరుడి దర్శనానికి వెళ్లొస్తున్న మహిళలపై ఎంపీ తన ప్రతాపం చూపాడని, ఆడవాళ్లలనే ఇంగితం లేకుండా పోరంబోకులు.... లం.... డాష్..డాష్..., మగాళ్లు మిమ్మల్ని ఎలా బయటకు రానిస్తున్నారు.. అంటూ చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో నీచాతినీచంగా దుర్భాషలాడారని వర్ల మండిపడ్డారు. 

దేవుడి దగ్గరకు వెళ్లొస్తూ, దారిపొడవునా జరుగుతున్న అమరావతి ఆందోళనలకు మధ్దతు తెలుపుతూ వస్తున్న అమరావతి జేఏసీ మహిళాసభ్యలకు, ఎంపీ నందిగం సురేశ్ తారసపడ్డాడని...ఆయన్ని చూడగానే ఎంపీ గారు అంటూ నలుగురు మహిళలు దగ్గరకెళ్లి నమస్కారం పెట్టి అమరావతి ఉద్యమానికి మద్ధతు తెలపాలని... జై అమరావతి నినాదాలు చేయాలని కోరగా వెంటనే ఎంపీ, ఆయన అనుచరులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారని రామయ్య వివరించారు. 

నడిరోడ్డుపై ఉండి తానొక బాధ్యతగల ఎంపీననే విజ్ఞతకూడా లేకుండా విచక్షణ కోల్పోయి సదరు మహిళలని నోటొకొచ్చినట్టు దూషిస్తూ నీచాతినీచంగా, అసభ్యంగా, అనరాని మాటలు అనాల్సిన అవసరం సురేశ్ కు ఎందుకొచ్చిందని వర్ల ప్రశ్నించారు. అమరావతి ఉద్యమమన్నా, అందులో పాల్గొంటున్న వారంతా ఎంపీకి ఎందుకంత అక్కసో తెలియడంలేదన్నారు. 

తన వాహనశ్రేణిలో అనుచరులను ఎక్కించుకొని ఉద్యమకారులను రెచ్చగొట్టేలా, వారిని తప్పుదారి పట్టించేలా పదేపదే సురేశ్ అమరావతి ప్రాంతంలో ఎందుకు పర్యటిస్తున్నాడో చెప్పాలన్నారు. పనిమీద వెళ్లినా తనపని తాను చూసుకొని రాకుండా ఉద్యమకారుల మధ్యలోకి ఎందుకు దూరుతున్నాడో  చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. జేఏసీ మహిళలు జై అమరావతి నినాదాలు చేయమని కోరడమే తప్పెలా అవుతుందో.. అంతదానికే వారి బస్సుని అడ్డగించి, తన అనుచరులతో దాన్ని చుట్టుముట్టి, బస్సులోని బయటకురాకుండా డ్రమ్ములు అడ్డుపెట్టి, అద్దాలు మూసేసి, కారం చల్లి, ఆడవాళ్లపై అంత అమానుషంగా ఎందుకు ప్రవర్తించారో, ఎవరి మెప్పుకోసం అంత హీనస్థితికి దిగజారారో సురేశ్ సమాధానం చెప్పాలని వర్ల నిలదీశారు. 

read more  చంచల్ గూడానా, ఎడారి జైలా...లేక జగన్ గతి పావురాల గుట్టేనా..: బుద్దా వెంకన్న

ప్రాణభయంతో మహిళలు, చిన్నారులు అరుస్తున్నాకూడా లెక్కచేయకుండా వారిపై దూషణలకు దిగి హింసాకాండకు పాల్పడటం ఎంపీకి తగునా అన్నారు. దళితకార్డుతో తనను అవమానించారని, తన కాలర్ పట్టుకున్నారని, ఎంపీ చెబుతున్నాడని, చుట్టూ పోలీసులను, అనుచరగణాన్ని పెట్టుకున్న వ్యక్తి చొక్కా పట్టుకునే ధైర్యం సాధారణ మహిళలకు ఉంటుందా అని రామయ్య ప్రశ్నించారు. 

ఎంపీనే తిట్టి వారిని ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే అతని అనుచరులు మరింత రెచ్చిపోయారని, ఒక మహిళచుట్టూ చేరి తాకరానిచోట తాకుతూ, బట్టలు నడుంపట్టుకొని, చేయరాని దుష్కృత్యాలన్నీ చేశారని రామయ్య తెలిపారు. ఎంపీ వెళ్లాక కూడా అతని అనుచరవర్గం మహిళల బస్సుని ముందుకుపోనీయలేదన్నారు. దాదాపు 3 గంటలవరకు దాన్ని అడ్డుకొని చంబల్ బందిపోటు దొంగలమాదిరిగా ఈ కిరాయిమూకలు  క్రూరంగా ప్రవర్తించారన్నారు. మూత్రవిసర్జనకు వెళ్లాలని వేడుకుంటున్నా పట్టించుకోకుండా వైసీపీ మూకలు పైశాచికంగా ప్రవర్తించారన్నారు. 

జై అమరావతి అనమంటే దమనకాండ సాగించడం, రాక్షసులు కన్నా దారుణంగా ప్రవర్తించడం ఎంపీకి, అతని అనుచరులకే చెల్లిందన్నారు. ఆడపడుచులు, వృద్ధులైన మహిళలు ఆఖరికి మూత్రవిసర్జన కోసం ఖాళీ సీసాలను వినియోగించాల్సిన దురవస్థను ఎంపీ, అతని అనుమాయులు కల్పించారని వర్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు సాయం చేద్దామని వచ్చినవారినికూడా తన్ని తరిమేశారని, పోలీసులు సకాలంలో స్పందించలేదన్నారు. 

బస్సులోని మహిళలపరిస్థితిని వివరిస్తూ, అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఒక మహిళ ఫోన్ ద్వారా తెలియచేయడంతో, తాను, టీడీపీ ఎంపీ జయదేవ్, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఇతర నేతలందరం బస్సున్న ప్రాంతానికి వెళ్లామన్నారు. తాము వెళ్లాక తాపీగా వచ్చిన పోలీసులు, మహిళలున్న బస్సుని పెదకూరపాడుకి తరలించాలని చూశారన్నారు. అడ్డుకున్న వారిని అరెస్ట్ చేయకుండా బాధితులైన మహిళలను తరలించాలని చూడటం ఎంతవరకు సమంజసమన్నారు. 

తామందరం అక్కడకు చేరుకున్నాక మహిళలను బస్సుతో సహా అమరావతి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని, మహిళలు తమకు జరిగిన అన్యాయంపై నిలదీయడంతో చేసేదిలేక ఎంపీపై, అతని అనుచరులపై చర్యలు తీసుకుంటామని స్థానిక డీఎస్పీ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే, ఆ స్థానాన్ని అవమానించేలా, తన దళితతత్వాన్ని తనే చులకనచేసుకునేలా సురేశ్ ప్రవర్తిస్తున్నాడన్నారు.