శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజాం పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికపై కొందరు గుర్తుతెలియని  దుండగులు హత్యాయత్నానికి  పాల్పడ్డారు.  ఆమెను బ్రతికుండగానే దహనం చేయడానికి ప్రయత్నించారు.  

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజాంకు చెందిన 13ఏళ్ల మైనర్ బాలిక అంపోలు భువనేశ్వరి అర్థరాత్రి ఇంటి వెనకాల తీవ్ర గాయాలతో పడివుండటాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే స్థానికంగా వున్న ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె 90శాతం కాలిపోయినట్లు... పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

read more  కామాంధుడి దురాతం: బాలికపై పది రోజులుగా అత్యాచారం

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువతి కుటుంబసభ్యుల నుండి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు.ఆమెను గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనక్కి లాక్కెల్లి పెట్రోల్ పోసి నిప్పంటించి గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధిత బాలిక కుటుంబీకులు  పోలీసులకు తెలిపారు. 

అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని వివిధ కోణాలో ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో బాలిక ఇంట్లోంచి బయటకు ఎందుకు వచ్చింది...ఆమెపై ఇంకా ఏదైనా అఘాయిత్యం జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.