హైదరాబాద్: ఓ కీచకుడు పది రోజులుగా ఓ బాలికపై నిత్యం అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై అతను అత్యాచారం చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

వివరాలు ఇలా ఉన్నాయి... హైదరాబాదులోని పంజగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న దంపతులకు ఓ కూతురు ఉంది. తల్లి ఇళ్లలో పనిచేసుకుంటుంగా, తండ్రి పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. తండ్రి సాయంత్రం వేళ డబ్బుల వసూలుకు బయటకు వెళ్తూ ఉంటాడు.

వారి కదలికలను వారు నివాసం ఉంటున్న బస్తీలోనే ఉంటున్న జహింగీర్ అనే యువకుడు గమనించాడు. తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు బాలిక ఒంటరిగా ఉంటోందని గుర్తించాడు. ఆమె బడికి వెళ్లి వచ్చేటప్పుడు పలుకరించడం ప్రారంభించాడు. పది రోజుల క్రితం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. 

ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి ప్రతి రోజూ ఆమెపై అత్యాచార చేస్తూ వచ్చాడు. పది రోజులుగా ఈ దారుణాన్ని సాగిస్తూ వస్తున్నాడు. మంగళవారం బయటకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు కూతురు నీరసంగా ఉండడాన్ని గమనించారు. ఏమైందని అడిగారు. 

దాంతో భయంభయంగా జహంగీర్ చేస్తున్న పనిని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వైద్యపరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి పంపించారు. జహంగీర్ పరారీలో ఉన్నాడు.