''సొమ్ములు పోనాయి, నానేటి సేత్తాను''... జగన్ వెంటే ఆ మంత్రి కూడా జైలుకే: కూన రవికుమార్
ఇప్పుడు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరునే గతంలో చంద్రబాబు అనుసరించి ఉంటే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను ఒక్క అంగుళమైనా చేయగలిగి ఉండేవాడా అని రవికుమార్ ప్రశ్నించారు.
విశాఖపట్నం: చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై వైసీపీ నేతలు ఎందుకంత ఉలికిపాటుకు గురవుతున్నారని, ఆయన ప్రజల్లోకి వెళుతుంటే ఆంక్షలు, అనుమతులతో అడ్డుకోవడం ఏంటని టీడీపీ సీనియర్ నేత, మాజీ విప్ కూనరవికుమార్ నిలదీశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్న తీరుపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.
గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరునే గతంలో చంద్రబాబు అనుసరించి ఉంటే జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను ఒక్క అంగుళమైనా చేయగలిగి ఉండేవాడా అని రవికుమార్ ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడటం కోసం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంతో లాలూచీపడిన జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఢిల్లీ వారితో దాగుడుమూతలు ఆడాడన్నారు.
మతికోల్పోయి మాట్లాడుతున్న బొత్స తన వ్యవహారాలు చంద్రబాబు బయటపెడతాడన్న భయంతోనే ఆయనకు గోబ్యాక్ చెబుతానంటున్నాడని రవికుమార్ తెలిపారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా బొత్స చేస్తున్న అవినీతిని, అక్రమాలు, దందాలు, అరాచకాలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు, దళితుల భూములు ఆక్రమించుకోవడం గురించి ఎక్కడ బయట పడతాయో అన్న భయంతో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నాడన్నారు. బొత్స లాంటి అవినీతిపరుడికి చంద్రబాబుని గోబ్యాక్ అనే అర్హత లేదన్నారు.
బొత్సకు ఉన్న డబ్బుపిచ్చి వల్లే ఆనాడు రాష్ట్రానికి రావాల్సిన వోక్స్ వ్యాగన్ పరిశ్రమ తరలిపోయిందని, దానిగురించి ఆనాడు ఆయన్ని ప్రశ్నిస్తే, “సొమ్ములు పోనాయి.. నానేటి సేత్తాను’’ అని సిగ్గులేకుండా మాట్లాడాడని, ఆ సొమ్ములు ఏడికి పోయినాయో సత్తిబాబు చెప్పాలని రవికుమార్ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలను జైలుకు పంపుతామంటున్న సత్తిబాబు ముందు తమ నాయకుడైన జగన్ ని ఎప్పుడు జైలుకు పంపుతున్నాడో, ఆయన వెంటే తానెప్పుడు వెళుతున్నాడో సమాధానం చెప్పాలని టీడీపీ నేత నిలదీశారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో ప్రజల సొమ్ముని బోగస్ కంపెనీకి ఇచ్చినందుకు ముందు బొత్సను జైలుకు పంపాలన్నారు.
చిట్టిరోజా కూడా టీడీపీవారిని జైలుకు పంపుతామంటూ చిలకపలుకులు పలుకుతోందని, పరిపాలనంటే జబర్దస్త్ షోలో వెకిలి చేష్టలు చేయడం కాదనే విషయాన్ని ఆమె తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగం పరిధిలో వ్యవస్థలకు లోబడి పనిచేయాల్సిన ప్రభుత్వం బరితెగించి ప్రవర్తిస్తోందని, అలాంటి ప్రభుత్వానికి ముకుతాడు ఎలా వేయాలో న్యాయస్థానాలకు తెలుసునని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజాకంటక పాలన సాగించేపాలకులను, ప్రభుత్వాలను కోర్టులే కట్టడి చేస్తాయన్న నిజాన్ని చిన్నిరోజా తెలుసుకుంటే మంచిదన్నారు.
read more విశాఖలో 39వేల ఎకరాలు కబ్జా... ఎక్కడ బయపడతాయో అనే...: కాల్వ శ్రీనివాసులు
చంద్రబాబు విశాఖ పర్యటన పై పోలీసులు లేనిపోని ఆంక్షలు పెట్టడం చూస్తుంటే జగన్ వెన్నులో వణుకు మొదలైందని అర్థమవుతోందన్నారు. గతంలో జగన్ విశాఖ పర్యటనకు వస్తున్నప్పుడు, అపూర్వ స్వాగతం పలకాలని విజయసాయి పిలుపునిస్తే, పట్టుమని పదిమంది కూడా బయటకు రాలేదన్నారు. ఆ చర్యతో ఆనాడే కంగుతిన్న జగన్, విజయసాయి చెంప ఛళ్లుమనిపించేలా సమాధానం చెప్పినా, ప్రభుత్వ తీరు మారలేదన్నారు.
ఏదేశానికైనా, రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందని, రాజ్యాంగంలోని శాసనవ్యవస్థలే ఈ విషయం చెప్పాయన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని స్వాగతించిన జగన్, నేడు మాటతప్పి, మడమ తిప్పడంతో పాటు ఒళ్లంతా బొంగరంలా తిప్పుతున్నాడన్నారు. గడచిన 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు చేయకుండానే అదే ప్రాంతం నుంచి పరిపాలన సాగిస్తున్నాడన్నారు. తాను బస్సులో ఉండి పరిపాలన సాగిస్తూ రైతుల నుంచి భూములు సేకరించి, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి భవనాలను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనకు నీరాజనాలు పడతారని పోలీసు ఆంక్షలతో అడ్డుకుంటున్నారన్నారు. మంత్రి బొత్సకు విజయవాడలో తిరిగే నైతిక అర్హత లేదని, ఆ ప్రాంతంలో ఉంటూ పరిపాలన చేస్తూ అదే ప్రాంతాన్ని, ప్రజల గురించి చులకనగా మాట్లడటం ఆయనకే చెల్లిందన్నారు. విశాఖ జిల్లాలోని పేదలందరికి ఇళ్ల పట్టాల రూపంలో 6116 ఎకరాలు ఇస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి, ఒక్కొక్క కుటుంబానికి సెంటు జాగా ఇస్తే అది నివాసానికి ఎంతవరకు పనికి వస్తుందో సమాధానం చెప్పాలని రవి కుమార్ డిమాండ్ చేశారు.
తాడేపల్లిలో రెండు ఎకరాల్లో నిర్మించిన ఇంటిలో జగన్ నివాసం ఉంటున్నాడన్నారు. పేదవాడికి 40 గజాల భూమి సరిపోతుందంటున్న జగన్ తానెందుకు లక్షల గజాల్లో నిర్మించిన ఇళ్లల్లో నివాసం ఉంటున్నాడన్నారు. బెంగళూరులోని యలహంకలో 6 ఎకరాల విస్తీర్ణంలో 200 గదులతో ఇంటిని నిర్మించుకున్న జగన్, దానిలో ఎస్కలేటర్, హెలీప్యాడ్, సిమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలన్నీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ ని 500 చదరపు గజాల్లో నిర్మించారని, పేదవాడికి ఇచ్చే ఇంటి స్థలాలు మాత్రం కాళ్లు చాపుకోవడానికి కూడా చాలనంతగా ఇవ్వటం కుట్ర పూరితం కాదా? అని టీడీపీ నేత ప్రశ్నించారు.
read more చంద్రబాబుపై చెప్పులు వేయమని చెప్పిందే ఆయన...: మాజీ మంత్రి జవహర్
విశాఖలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన 6,116 ఎకరాల్లో ఆనందపురం మండలంలో 529 ఎకరాలు, భీమునిపట్నం మండలంలో 486 ఎకరాలు, పద్మనాభం మండలంలో 516, సబ్బవరం మండలంలో 1373 ఎకరాలు, పెందుర్తి మండలంలో 496, గాజువాకలో 89, పెద గంట్యాడ మండలంలో 159, విశాఖ రూరల్ లో 96, అనకాపల్లి 1452 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్ 79 ఎకరాల నిషేధిత భూములు, 19 ఎకరాల ఖాళీ స్థలాలు, పేదవారు కొన్నేళ్ల నుంచి సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములే ఉన్నాయన్నారు. 2013 భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా భూములను సేకరిస్తున్నారని, ఒక్క ఆనందపురం మండలంలోనే 1100 ఎకరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ భూముల్లో దళితులకు ఇచ్చినవే 50 శాతం వరకు ఉన్నాయన్నారు.
ఓట్ల కోసం హరిజనులు, గిరిజనులు, దళితులను వాడుకుంటున్న జగన్ అధికారంలోకి వచ్చాక వారి భూములనే లాక్కోవాలని ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి దళితుల స్వాధీనంలో ఉన్న భూ సేకరణ పేరుతో బలవంతంగా లాక్కుంటుంటే వైసీపీకి చెందిన ఎస్ టి, ఎస్ సి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని కూన నిలదీశారు. విశాఖ జిల్లాలో వైసీపీ నేతల కబ్జాలో ఉన్న 30 వేల ఎకరాలను పేదలకు ఎందుకు పంచడంలేదని ప్రశ్నించారు.
2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా దళితుల భూములను లాక్కొంటున్న చర్యలపై నిరసనగా ఆయా వర్గాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కొన్ని వేల కోట్ల విలువ చేసే భూములను తీసేసుకుంటున్న జగన్ పేదలందరికి అన్ని సదుపాయాలతో ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా, స్థలాలివ్వడం ద్వారా వారికి ఎలా న్యాయం చేస్తారన్నారు.
దళితుల భూములు సేకరించి పేదలకు ఇవ్వాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, అరబిందో ఫార్మా, విజయసాయిరెడ్డి వియ్యంకుడు, అతని బంధువులకు చెందిన భూములను తీసుకొని ప్రజలకు పంచితే బాగుండేదన్నారు. భూములు లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డికి దళితులు, గిరిజనులే దొరికారా అని కూన నిగ్గదీశారు. ఇళ్ల స్థలాల ముసుగులో జగన్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల భూములను లాక్కోవడం దారుణమని కూన రవికుమార్ మండిపడ్డారు.