విశాఖపట్నం: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మద్య మాటామాటా పెరిగి అదికాస్తా గొడవకు దారితీసి చివరకు ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణను మరిచి అసలు తానేం చేస్తున్నాడో కూడా తెలియక స్నేహితున్ని రాయితో బాది అతి కిరాతకంగా హతమార్చాడో యువకుడు.  

ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి శారదా నది సమీపంలోని స్మశాన వాటిక వద్ద రాజు(24), పరమేష్(25)లు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మద్య ఏదో విషయంలో చిన్నగా మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడయిన పరమేష్ రాజు తలపై బండరాయితో బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమే రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. 

read  more   కాలువ గట్టున విందు... నీటి కోసం దిగి ఇద్దరు ప్లంబర్లు మృతి

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ హాస్పిటల్ తరలించారు. అనంతరం ముద్దాయి మద్దాల పరమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మృతుడు రాజు అగనంపూడి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీంతో అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.