రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలంతా మూడు రాజధానుల ప్రతిపాదనపై మొగ్గు చూపుతున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారి కుంటాయని.. ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.

గతాన్ని పరిశీలిస్తే.. రాజధానిగా ఉన్న మద్రాస్‌ కర్నూలుకి మారిందని.. అక్కడ నుంచి హైదరాబాద్‌కి తరలిందని స్పీకర్ వివరించారు. ప్రాంతీయ అసమానతల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని సీతారాం పేర్కొన్నారు. రాజధాని పేరుతో ఒకేచోట అభివృద్ధి జరగటం వలన మిగిలిన ప్రాంతాలలో అసంతృప్తి పెరుగుతోందని చెప్పారు.

Also Read:వాయిస్ మార్ఫింగ్ చేశారు, మళ్లీ వస్తా: పృథ్వీరాజ్

ఒకేచోట అభివృద్ధి వల్ల మిగిలిన ప్రాంతాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గి.. పేదరికం పెరిగిందని తమ్మినేని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందని స్పీకర్ స్పష్టం చేశారు.

వికేంద్రీకరణ జరగకపోవడం వలనే కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం జరిగిందని సీతారామ్ గుర్తుచేశారు. ఉత్కళ కళింగ పేరుతో గతంలో ఉత్తరాంధ్ర, ఒడిశాలో వెనుకబాటుకు గురైన ప్రాంతాల్లో ఉద్యమ భావన వచ్చిందన్నారు. మూడు రాజధానులు ప్రతిపాదన రాకపోతే ఉత్కళ కళింగ ఉద్యమం మళ్లీ ఉపందుకునేదని స్పీకర్ తెలిపారు.

మూడు రాజధానుల ద్వారా రాష్ట్రమంతా సమాన అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని ఆమోదించలేమని, రాష్ట్ర అభివృద్ధి గురించి కాకుండా కొన్ని గ్రామాల కోసం ఉద్యమించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని స్పీకర్ ఎద్దేవా చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థనైనా ఏర్పాటు చేయలేదని.. ఎందుకు తమ జిల్లా సమస్యలు పట్టించుకోలేదని చంద్రబాబును ప్రశ్నించారు.ఉత్తరాంధ్ర భవిష్యత్తు తరం కోసం తాము పోరాడుతున్నామని.. పాలన, అభివృద్ధి రెండూ వికేంద్రీకరణ జరగాలని సీతారామ్ చెప్పారు.

Also Read:ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయాలని తాము గతంలోనే కోరామని.. విశాఖలో వాయు, జల, రోడ్డు, రైల్వే మార్గాలున్నాయని స్పీకర్ గుర్తుచేశారు.  విజన్‌-2020 అంటే చంద్రబాబు రోడ్డుపై జోలి పట్టుకుని బిక్షాటన అనుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.

రైతుల భూములను చంద్రబాబు బలవంతంగా తీసుకోలేదా.. రాజధాని పేరుతో ఇన్‌సైడర్‌కు పాల్పడలేదా అని ప్రశ్నించారు. విశాఖ రాజధానికి చంద్రబాబు వ్యతిరేకమా..అనుకూలమా తేల్చి చెప్పాలని స్పీకర్ డిమాండ్‌ చేశారు.