వాయిస్ మార్ఫింగ్ చేశారు, మళ్లీ వస్తా: పృథ్వీరాజ్
మహిళలపై వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ వ్యవహారం వివాదంగా మారడంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు
మహిళలపై వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ వ్యవహారం వివాదంగా మారడంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తాను 11 ఏళ్ల నుంచి వైసీపీలో ఉన్నానన్నారు.
టీటీడీ ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రతిరోజూ కంటి మీద కునుకు లేకుండా పనిచేశానన్నారు. ఎస్వీబీసీకి మంచి పేరు తేవాలని చూశానని ప్రయత్నించానని తెలిపారు. పార్టీ అధ్యక్షుడి మాటను గౌరవించానని.. రైతులపై చేసిన వ్యాఖ్యలు ఇంత వివాదం అవుతుందనుకోలేదని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా
రైతులు నా వ్యాఖ్యలను వేరేలా అర్థం చేసుకున్నారని.. కార్పోరేట్ రైతుల గురించే తాను మాట్లాడానని ఆయన స్పష్టం చేశారు. రైతులందరినీ తాను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదని.. ఇదే సమయంలో అమరావతిలో బినామీ రైతులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పృథ్వీ స్పష్టం చేశారు.
తనపై కుట్ర జరుగుతుందని ముందే ఊహించానని.. సంక్రాంతి సమయంలో తన కుటుంబం కన్నీళ్లు పెట్టుకుందని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. తన వాయిస్‌ను మార్ఫింగ్ చేశారని.. తాను తాగుబోతును కానని, కావాలంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవచ్చునని పృథ్వీరాజ్ సవాల్ విసిరారు.
కొందరు తనను దెబ్బకొట్టాలని చూశారని.. నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీసిన ప్రతిపక్షాలకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారాన్ని మొదటి నుంచి ఖండిస్తున్నానని... ఈ నెల 10న తనపై కూడా దాడి జరిగిందని ఆయన గుర్తుచేశారు.
Also Read:విచారణలో అన్నీ తెలుస్తాయి, రైతులకు క్షమాపణ: పృథ్వీ వీడియో
పోసాని ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారో అర్థం కాలేదని పృధ్వీ చెప్పారు. 1989 నుంచి వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉందని, జగన్.. వైవీ సుబ్బారెడ్డికి దగ్గరవుతున్నాననే తనపై కుట్ర చేశారని పృథ్వీ ఆరోపించారు. రైతుల కష్టాలు తనకు తెలుసునని.. అసలైన రైతులకు క్షమాపణ చెప్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎంక్వైరీ పూర్తయ్యకే తాను మళ్లీ ఎస్వీబీసీలో అడుగుపెడతానని పృథ్వీ స్పష్టం చేశారు. రేపటి నుంచి ఏదైనా మాట్లాడుతానని... అందరినీ కడిగి పారేస్తాని ఆయన వెల్లడించారు. తన వాయిస్ మార్ఫింగ్ చేయడంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన పేర్కొన్నారు.