విశాఖపట్నం:  ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి నుండి ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం శాసనమండలిలో పెండిగ్ లో వున్న విషయం తెలిసిందే. ఏపి వికేంద్రీకణ పేరుతో  రాజధాని తరలింపుకు సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు అర్థాంతరంగా మండలిలో ఆగిపోయింది. దీంతో రాజధాని తరలింపుకు కొంతకాలం బ్రేక్ పడుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కకుండా వుంటున్నారు. 

ఇప్పటికే అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను విశాఖకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగులకు మౌఖికంగా సమాచారం ఇచ్చింది.

ఈ క్రమంలోనే విశాఖలో ప్రభుత్వ కార్యాకలాపాలకు అనుకూలంగా వుండేలా నిర్మాణాలను మొదలెట్టారు. ముఖ్యంగా అధికారిక కార్యకలాపాలకు వేదికగా మిలీనియం టవర్ వుండే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు కూడా వుంటున్నారు. తాజాగా మిలీనియం టవర్-బి నిర్మాణం కోసం ఏపి సర్కార్ రూ. 19.73 కోట్ల విడుదల చేసింది. 

టవర్-బి నిర్మాణం కోసం ఐటీ శాఖ నుండి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఈ మిలీనియం టవర్సులోనే సెక్రటేరీయేట్ కార్యకలాపాలు నిర్వహించాలని  సీఎం జగన్ తో పాటు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే త్వరితగతిన నిధుల కేటాయింపు జరుగుతోందని సమాచారం. 

read more  కర్నూలుకు కార్యాలయాల తరలింపు: హైకోర్టులో సవాల్ చేసిన రైతులు

ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం విజయవాడలో ఉంది. ఆ తర్వాత దశలవారీగా అమరావతి నుంచి కార్యాలయాలు విశాఖకు తరలించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నెలాఖరుకల్లా కీలక కార్యాలయాల తరలింపుపై ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 

 ప్రస్తుతం రాజధాని అమరావతి  ప్రాంతంలోని సచివాలయంలో ఉన్న రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అదికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 

హైకోర్టుతో పాటు న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటిని కర్నూలులో పెడతామని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. ఇందులో భాగంగానే మొదట విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూల్ కు తరలిస్తోంది. 

read more  అమరావతి భూముల కొనుగోలులో మనీ లాండరింగ్?: దర్యాప్తుకు ఈడీకి సీఐడీ లేఖ

సచివాలయంలో ఉన్న కార్యాలయాలు తరలిస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కార్యాలయాల కోసం అవసరమైన భవనాలు ఎంపిక చేసి ఏర్పాట్లు చేయాలని కర్నూలు కలెక్టర్, ఆర్అండ్‌బీ అధికారులకు సీఎస్ నీలం సాహ్ని అదేశాలు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు వస్తాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి ఏపిలో ఆందోళనలు మొదలయ్యాయి. నెలలు గడుస్తున్నా అమరావతి ప్రాంతంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడంతో మూడు రాజధానుల నిర్ణయానికి కాస్త బ్రేక్ పడిందని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలను కర్నూల్ కు తరలించాలన్న జగన్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.