కర్నూలుకు కార్యాలయాల తరలింపు: హైకోర్టులో సవాల్ చేసిన రైతులు
కర్నూలుకు కార్యాలయాలను తరలిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ జీవో రాజ్యాంగ విరుద్ధమైందని వారన్నారు.
అమరావతి: అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాయాలను తరలించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
జీవో నెంబర్ 13 చట్టవిరుద్ధమని రైతులు తమ పిటిషన్ లో అన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు మంగళవారం విచారణ జరుపతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్డీఎ చైర్మన్ ను, సీఆర్డీఎను ప్రతివాదులుగా చేరుస్తూ రైతుల తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
ఇదిలావుంటే, రాజధాని తరలింపుపై కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందని మాజీ మంత్రి, బిజెపి నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. రాజధాని అంశాన్ని త్వరలో కంద్రం దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన చెప్పారు. ఆయన సోమవారం రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. రాజధాని తరలిపోకుండా బిజెపి ఆపగలదని ఆయన అన్నారు.
Also Read: వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలనం: అర్థరాత్రి జీవో జారీ
రంగంపేటలో ఆదివారం జరిగిన ప్రజా ఉద్యమ వ్యతిరేక సభ వెలవెలబోవడంతో మీరు ఆందోళనకు గురైనట్లు రాష్ట్రం గుర్తించిందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు .ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు
మంత్రులు, సలహాదారులు, శాసనసభ్యులు హాజరైన సభకు జనం నామమాత్రంగా రాడం మీ నిర్ణయానికి వ్యతిరేక రెఫరెండం కాదా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు. ఇక రాజధాని తరలింపును మానుకోవాలని ఆయన సూచించారు.