తొలిసారి విమానప్రయాణం చేసిన.. ప్రపంచ ఎత్తైన మహిళ.. దాని గురించి ఏమన్నారంటే..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ మొదటిసారి విమానప్రయాణం చేశారు. ఆ అనుభవం అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్ లో పిక్ షేర్ చేశారు.
టర్కీ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నీస్ రికార్డు సృష్టించిన టర్కీకి చెందిన రుమెయ్ సా తొలిసారి విమాన ప్రయాణం చేశారు. ఇస్తాంబుల్ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో 13 గంటల పాటు ఆమె విమానంలో ప్రయాణించారు. ఆమె కోసం ఎయిర్లైన్స్ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆరు సీట్లను స్ట్రెచర్ లా తయారుచేసి, ఆమె నిద్రించేందుకు అనువుగా మార్చింది. దీనిపై రుమెయ్ సా ఎయిర్లైన్స్ సంస్థ కు ధన్యవాదాలు తెలిపారు. ‘నా మొదటి విమాన ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. నాతో పాటు ప్రయాణించిన వారందరికీ ధన్యవాదాలు. ఇది నా తొలి విమాన ప్రయాణం. ఇదే చివరిది కాకూడదని కోరుకుంటున్నా’ అని ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
దీనిపై టర్కీ ఎయిర్లైన్స్ సంస్థ కూడా స్పందించింది. భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత పొడవైన మహిళ గా గిన్నీస్ రికార్డు సాధించిన రుమెయ్ సా ఎత్తు అక్షరాల 215.16 సెంటీమీటర్లు. అత్యంత పొడవైన వేళ్లు కలిగిన మహిళగా, అత్యంత పొడవైన వీపు కలిగిన మహిళగా కూడా ఆమె పేరిట రికార్డులున్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పేర్కొన్న వివరాల ప్రకారం..వేవర్ సిండ్రోమ్ అనే జన్యు సమస్య కారణంగానే ఆమె అసాధారణంగా పెరిగినట్లు తెలుస్తుంది. దీని వల్ల కొన్ని చోట్ల ఎముకలు అవసరమైన దానికంటే ఎక్కువగా పెరిగిపోతాయి.
బాటిల్ నిండా దోమలతో కోర్టు విచారణకు హాజరైన గ్యాంగ్ స్టర్.. ట్విస్ట్ ఇచ్చిన న్యాయస్థానం...
దీంతో నడవడం, ఊపిరి తీసుకోవడం, మింగడం కష్టతరమవుతుంది. రుమెయ్ సా గెల్గీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన టీనేజర్ గా 2014లోనే గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అక్టోబర్ 2021లో అత్యంత పొడవైన మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 25యేళ్ల గెల్గీ.. ప్రస్తుతం సాంకేతిక విభాగంలో పనిచేస్తున్నారు. మరిన్ని అవకాశాలు వెతుక్కునేందుకు ఆమె అమెరికా వెళ్లారు. ఆరు నెలల పాటు అక్కడే ఉండనున్నారు.
ఆమె పరిస్థితి కారణంగా, గెల్గికి కదలడం, తిరగడం చాలా సమయం పడుతుంది. అందుకే తక్కువ టైంలో సురక్షితంగా కదలడానికి వీల్‌చైర్, వాకర్ వాడతారు. ఈత కొట్టడం, కుటుంబంతో గడపడం అంటే ఆమెకు ఇష్టమని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.