అతనో గ్యాంగ్ స్టర్.. మనుషుల్నే కాదు.. దోమల్నీ చంపగలననుకున్నాడేమో.. ఓ బాటిల్ నిండా చచ్చిన దోమలతో కోర్టుకు హాజరయ్యాడు. కోర్టులోకి జనం అంతా విచిత్రంగా చూశారు. ఇంతకీ అతని బాధేంటంటే... 

ముంబై : దోమలతో అనేక ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా.. లాంటివి సోకితే రోజుల్లోనే చనిపోవడం ఖాయం. అందుకే దోమలు కుట్టకుండా, అవి ఎక్కువగా వృద్ధి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. దోమలు కుట్టకుండా ఉండడానికి దోమతెరలు వాడడం, ఆలౌట్, ఒడోమాస్, టార్టాయిస్ కాయిల్స్... వాడతారు. దోమలను తరిమికొట్టడానికి బత్తీలు కూడా వస్తున్నాయి. ఇలా దోమలనివారణ చుట్టూ రకరకాల బిజినెస్ ఉంది. అయితే ఈ దోమల్నే సాకుగా చెప్పి జైల్లో పర్సనల్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడో ఖైదీ.. కానీ కోర్టు మాత్రం అతను అనుకున్నది కాకుండా వేరేలాగా తీర్పు నిచ్చింది. ఈ ఘటన ముంబై కోర్టులో అందరిలోనూ ఆసక్తి రేపింది. 

జైలులో దోమల బెడద తీవ్రంగా ఉందని చెప్పేందుకు ఓ దోషి విచిత్ర పంథాను ఎంచుకున్నాడు. ఓ బాటిల్ నిండా చనిపోయిన దోమలతో కోర్టుకు వెళ్ళాడు. విచారణ సందర్భంగా ఆ బాటిల్ ని చూపించి.. దోమల బారి నుంచి రక్షించుకునేందుకు తనకు దోమతెర ఏర్పాటు చేయాల్సిందిగా కోర్టును కోరాడు. పలు కేసుల్లో నిందితుడైన గ్యాంగ్స్టర్ ఏజాజ్ లక్డావాలా ప్రస్తుతం ముంబైలోని తలోజా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మాజీ అనుచరుడు కూడా. 

ఢిల్లీ గాలి, నీటిలోనే కాదు.. కేజ్రీవాల్ ఉద్దేశంలోనూ కాలుష్యం ఉంది - బీజేపీ

అయితే, తలోజా జైలులో దోమల బెడద తీవ్రంగా ఉందని తన గదిలో దోమతెర ఏర్పాటు చేయాల్సిందిగా సెషన్స్ కోర్టులో దరఖాస్తు దాఖలు చేశాడు. ఈ పిటిషన్కు సంబంధించి గురువారం విచారణ జరిగింది. దీనికి ఎజాజ్ హాజరయ్యాడు. జైలుగదిలో తాను చంపిన దోమలను ఓ ప్లాస్టిక్ బాటిల్ లో నింపి.. దాన్ని కోర్టుకు తీసుకు వచ్చాడు. విచారణ సందర్భంగా ఆ బాటిల్ ను చూపించాడు. జైల్లో ఇదీ పరిస్థితి అని, రక్షణగా దోమతెర ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరాడు. 

2020లో తాను అరెస్ట్ అయిన సమయంలో ఏర్పాటు చేశారని, కానీ, భద్రతా కారణాలను చూపిస్తూ కొద్ది రోజులకు దాన్ని తొలగించారని పేర్కొన్నాడు. అయితే, వాదనలు విన్న తర్వాత ఆ పిటిషన్ కు కోర్టు కొట్టివేసింది. దోమల బారి నుంచి కాపాడుకునేందుకు దోమతెరలు వాడాల్సిన అవసరం లేదని, ప్రత్యామ్నాయంగా ఒడోమాస్ లేదా దోమలను అరికట్టే ఇతర సాధనాలను వినియోగించాలని స్పష్టం చేసింది.