Viral Video : చేతిలో టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వే... ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
Viral Smile : అమ్మాయిలు నవ్వితే బాగుంటుందని అందరూ చెబుతుంటారు. కానీ ఓ తెలుగబ్బాయి నవ్వు ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. ఇంతకూ ఇలా పగలబడి నవ్వుతున్న ఆ కుర్రాడు ఎవరు..?

ఒక్క నవ్వుతో పడేశాడు..
Viral Video : సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదిద్దామని చాలామంది భావిస్తుంటారు... అందుకే యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటారు. అయితే ఇలా చేసిన అందరూ ఫేమస్ కాలేరు... లక్షల్లో ఏ ఒకరో ఇద్దరో అనుకున్నది సాధిస్తారు. కానీ కొంతమందికి అదృష్టం కలిసివస్తుంది... తమ ప్రమేయం లేకుండా సోషల్ మీడియాలో మెరుస్తుంటారు. ఇలా కుమారీ ఆంటీ, ప్రయాగరాజ్ లో పూసలమ్మే అమ్మాయి మోనాలీసా, ఇటీవల మేడారంలో పోలీస్ అధికారి వంటివారు... వీళ్ల వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.
అయితే వీళ్లందరి వీడియోల కన్నా ఎక్కువగా ఓ కుర్రాడు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాడు. చేతిలో ఛాయ్ గ్లాస్ పట్టుకుని, మనస్పూర్తిగా నవ్వుతూ కనిపించే ఆ బాలుడి వీడియోను మీమర్స్ విపరీతంగా వాడుతుంటారు. ఇక కామెడీ వీడియోలు, ఇతర సందర్భాల్లోనూ అతడి నవ్వును వాడుతుంటారు. కామెడీ వీడియో, మీమ్స్ చూస్తే నవ్వు వస్తుందో రాదో తెలీదుగానీ ఆ కుర్రాడి నవ్వు చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు. అతడి నవ్వు వీడియోకు మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి... అతడి నవ్వుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు.
ఈ వైరల్ కుర్రాడు మన తెలుగోడే...
ఈ కుర్రాడి వీడియోను చూసి నవ్వుకోవడం తప్ప అతడు ఎవరో చాలామందికి తెలీదు. అతడు ఏ తమిళనాడో, కర్ణాటకనో లేక నార్త్ ఇండియాకు చెందినవాడో అని భావిస్తుంటారు… కానీ అచ్చ తెలుగబ్బాయి. ఒక్క నవ్వుతో ఫేమస్ అయిన ఈ తెలంగాణ కుర్రాడి గురించి, అతడి వీడియో గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరీ కుర్రాడు..?
మీమ్స్, ట్రోల్స్ లో టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వుతూ కనిపించే కుర్రాడిపేరు అరుణ్. అతడి స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాలపల్లి (నల్లపుచ్చట పల్లి) గ్రామం. పేద కుటుంబంలో జన్మించిన అరుణ్ కు చదువు అబ్బకపోవడంతో చిన్నతనంలోనే లారీ క్లీనర్ గా మారాడు. నెహ్రూ అనే లారీ డ్రైవర్ వద్ద పనిచేస్తున్నాడు. ఇలా చాలాకాలంగా లారీ క్లీనర్ గా కష్టపడి పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు.
ఈ నవ్వు వెనక స్టోరీ...
రోజు మాదిరిగానే డ్రైవర్ నెహ్రూ, క్లీనర్ అరుణ్ లారీలో వెళుతూ ఓ చోట టీ కోసం ఆగారు. ఇద్దరూ టీ గ్లాస్ చేతబట్టుకుని తాగుతుండగా నెహ్రూ జోక్ వేశాడు... అది ఎంతలా నచ్చిందోగానీ అరుణ్ చేతిలో వేడివేడి టీ పట్టుకుని కూడా పగలబడి నవ్వాడు. టీ కాలుతున్నా అతడి ముఖంలో ఏమాత్రం బాధ కనిపించదు... చేతిని దులుపుకుంటూ నవ్వడం కొనసాగించాడు.
అరుణ్ నవ్వు చూసి డ్రైవర్ ఏమనుకున్నాడోగానీ వీడియో తీశాడు... ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. మనస్పూర్తిగా పగలబడి నవ్వుతున్న ఈ కుర్రాడి వీడియో నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో వైరల్ గా మారి మీమర్స్ కంటపడింది... ఇంకేముంది కామెడీ మీమ్స్ లో తెగ వాడేశారు. ఇలా ఒక్క నవ్వు అరుణ్ జీవితాన్నే మార్చసింది... సోషల్ మీడియా స్టార్ ని చేసింది.
అరుణ్ జీవితాన్ని మార్చిన నవ్వు..
ఒక్క నవ్వుతో ఫేమస్ అయిన అరుణ్ ఇప్పుడు యూట్యూబ్ తో పాటు టీవీ ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో తన నవ్వు వెనకున్న కష్టాలను కూడా బైటపెట్టాడు. పేదరికం అతడిని చదువు మానేసేలా చేస్తే... ఒక్క నవ్వు తిరిగి చదువుకునేలా చేసింది. డ్రైవర్ నెహ్రూ సహకారంతో 4వ తరగతితో చదువు మానేసిన అరుణ్ పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యాడు.
ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి సొంతంగా కామెడీ వీడియోలు చేస్తున్నాడు అరుణ్. అతడి వీడియోలు వర్కౌట్ అవుతున్నాయో లేదో తెలీదుగానీ ఇప్పటికీ ఆ నవ్వు వీడియో ఎక్కడచూసినా కనిపిస్తుంది. మీమర్స్ ఈ వీడియో లేకుండా కామెడీ మీమ్స్ చేయలేని పరిస్థితి ఉంది.

