అన్నకు రాఖీ కట్టిన చెల్లెలు.. ఫొటో వైరల్.. కారణం ఏంటంటే...
దేశం కోసం అమరుడైన అన్న విగ్రహానికి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుందో చెల్లెలు. ఈ ఫొటోను వేదాంత్ బిర్లా పోస్ట్ చేయగా.. ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
రాఖీ పండుగ వేళ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. అది చూసిన చాలామంది ఉద్వేగానికి లోనవుతున్నారు. మరికొందరు భారతదేశం గొప్పతనం అదే అంటూ ఆ ఫొటోకు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏంటా ఫొటో అంటే.. ఓ మహిళ వీరసైనికుడి విగ్రహానికి రాఖీ కడుతోంది. దాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదిప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటూ.. లైకులు, షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది.
వేదాంత్ బిర్లా తన లింక్డ్‌ఇన్‌లో తన సోదరుడి విగ్రహం చేతికి రాఖీ కడుతున్న సోదరి ఫొటో.. హృదయాన్ని కదిలిస్తుంది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో శత్రువులతో పోరాడుతూ తన ప్రాణాలను అర్పించిన ధైర్యవంతుడు షహీద్ గణపత్ రామ్ కద్వాస్ విగ్రహం అది. ఆ విగ్రహానికి మహిళ రాఖీ కట్టి రక్షాబంధన్ ను గౌరవించింది.
చిన్నారులతో ప్రధాని మోదీ రక్షా బంధన్ సెలబ్రేషన్.. వారంతా ఎవరంటే..
దీనిమీద వేదాంత్ బిర్లా రాసుకొస్తూ... “ఇది భారతదేశాన్ని అపురూపంగా మార్చింది. దుఃఖం, గర్వం ఒకే క్షణంలో కలిగే సందర్భం. సోదరుడిని కోల్పోయినందుకు విచారం ఓ వైపు.. దేశం కోసం అత్యున్నత త్యాగం చేశాడన్న గర్వం మరోవైపు.. రక్షా బంధన్ రోజున ఆమె ఈ రెండు భావోద్వేగాలతో సతమతమవుతుంది, ఆమె తన సోదరుడికి రాఖీ కట్టలేదు. అందుకే అతని విగ్రహానికి కట్టింది. షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఓసియన్‌లోని ఖుడియాల గ్రామానికి చెందినవారు. అతను జాట్ రెజిమెంట్ లో పనిచేసేవాడు. జమ్మూ కాశ్మీర్‌లో శత్రువులతో పోరాడుతూ 24.9.2017న అమరవీరుడయ్యాడు’’ అని వివరణలో రాసుకొచ్చారు.
ఈ పోస్ట్‌కి 3వేలకు పైగా స్పందనలు, టన్నుల కొద్దీ కామెంట్‌లు వచ్చాయి. పోస్ట్ చాలా మంది హృదయాలను కదిలించింది. దేశాన్ని కాపాడే క్రమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టినందుకు ఆర్మీ జవాన్లకు కృతజ్ఞతలు తెలుపుతూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.