ఆయన దశ మార్చిన ‘ఉల్లి’.... ఒక్క దెబ్బతో కోటీశ్వరుడయ్యాడు..
ఉల్లి పంట పండించడమే ఆ రైతు చేసిన పని.... ఇప్పుడు అతని ఇంట ఉల్లి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ రైతు కోటి ఉల్లి కథ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులు కనీసం కేజీ ఉల్లి కొనాలన్నా భయపడిపోతున్నారు. ఉల్లి కోయకుండానే... కొనాలంటేనే కన్నీళ్లు వస్తున్నాయంటూ... పలువురు అభిప్రాయపడుతున్నారు. అందరూ ఉల్లి గురించి ఇలానే మాట్లాడుతున్నారు. అయితే.... ఇదే ఉల్లి ఓ వ్యక్తి దశ, దిశ మార్చేసింది. ఒకే దెబ్బతో కోటీశ్వరుడు అయిపోయాడు.
ఉల్లి పంట పండించడమే ఆ రైతు చేసిన పని.... ఇప్పుడు అతని ఇంట ఉల్లి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ రైతు కోటి ఉల్లి కథ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
also read: ఉల్లి జోకులు
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా దొడ్డసిద్దవ్వనహళ్లికి చెందిన మల్లికార్జున(42) ఈ ఏడాది ఉల్లి పంట పండించాడు. అందరు రైతుల్లానే అప్పు తీసుకువచ్చి మరీ ఉల్లి పంట సాగు చేశాడు. ఈ పంట వేయడానికి ముందు అతనికి చాలానే అప్పు ఉంది. కానీ... మళ్లీ ధైర్యం చేశాడు. ఆ అప్పు తీరకుండానే.. మరో రూ.15లక్షలు అప్పు తెచ్చి మరీ ఉల్లి పంట వేశాడు.
అయితే... ఈ ధైర్యమే అతని దశ మార్చేసింది. మల్లికార్జున సాగు చేసిన 20 ఎకరాల్లో 240 టన్నుల (దాదాపు 20 ట్రక్కుల లోడు) ఉల్లి దిగుబడి రాగా.. అదే సమయంలో ధర ఆకాశాన్నంటడంతో అతడి పంట నిజంగానే పండినట్టయింది.
క్వింటాలుకు రూ.7 వేలు చొప్పున విక్రయించగా.. అతడికి రూ.1.68 కోట్లు వచ్చాయి. దీంతో అతడు ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ‘పంట సరిగ్గా పండకపోయినా, ఉల్లి ధరలు పడిపోయినా.. నేను అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉండేవాడిని. కానీ, ఉల్లిపాయలు నా అదృష్టాన్ని మార్చేశాయి’ అని మల్లికార్జున ఆనందంగా చెబుతున్నాడు. వచ్చిన డబ్బుతో తన అప్పులన్నీ తీర్చేశానని.. ఇప్పుడు ఇళ్లు కట్టుకోవాలని అనుకుంటున్నానని అతను చెప్పడం విశేషం. ఉల్లి ధర పెరిగి.. ప్రజల చేత కన్నీళ్లు మాత్రమేకాదు.... ఆనంద భాష్పాలు కూడా రప్పించగలదని ఇతని విషయంలో నిరూపించింది.