Asianet News TeluguAsianet News Telugu

వాలంటైన్స్ డే రోజు విచిత్రం... ప్రేమ పెళ్లి చేసుకోమంటూ అమ్మాయిలంతా..

మాకు మా తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంది.. వారు చూపించిన అబ్బాయినే పెళ్లాడతాం. ప్రేమలో పడనేం పడం.. ప్రేమ పెళ్లి మాటే ఎత్తం అంటూ ఆ ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. అక్కడితో అయిపోలేదు.. వరకట్నం అడిగే అబ్బాయిని కూడా తాము పెళ్లి చేసుకోమని వారంతా తేల్చి చెప్పడం విశేషం. 

Maharashtra College Girls Made To Take Oath Against Love Marriage
Author
Hyderabad, First Published Feb 15, 2020, 12:19 PM IST

వాలంటైన్స్ డే అనగానే ఎవరికైనా ప్రేమికులే గుర్తుకువస్తారు. ప్రేమపక్షలు ఆనందంగా విహరించడం... తమ ప్రేమ ఊసులు చెప్పుకోవడం చేస్తారు. ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకొని ప్రేమ బాసలు చెప్పుకుంటారు. ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుందాం అంటూ ప్రమాణాలు చేసే జంటలు కూడా లేకపోరు. అలాంటి ప్రేమికుల రోజున వందల మంది అమ్మాయిలు ఓ చిత్ర విచిత్ర వాగ్దానం చేశారు.

తాము జీవితంలో ప్రేమ పెళ్లి చేసుకోము అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇంట్లో పెద్దలు కుదర్చిన పెళ్లే చేసుకుంటామని అమ్మాయిలంతా ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా... దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని చందూర్ రైల్వే కాలనీలో ఉండే మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ విద్యార్థినులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఒక్కచోట చేరి మరాఠీలో.. ‘‘ మేము ఎవరినీ ప్రేమించలేదు, భవిష్యత్తులో ఎవరినీ ప్రేమించడం.. ప్రేమ పెళ్లి అసలే చేసుకోం’ అంటూ ప్రతిజ్ఞ చేయడం విశేషం.

Also Read మెట్రోలో చేదు అనుభవం.. యువతికి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ.....

అంతేకాదు.. మాకు మా తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంది.. వారు చూపించిన అబ్బాయినే పెళ్లాడతాం. ప్రేమలో పడనేం పడం.. ప్రేమ పెళ్లి మాటే ఎత్తం అంటూ ఆ ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. అక్కడితో అయిపోలేదు.. వరకట్నం అడిగే అబ్బాయిని కూడా తాము పెళ్లి చేసుకోమని వారంతా తేల్చి చెప్పడం విశేషం. ప్రస్తుతం వీరు తీసుకున్న నిర్ణయం.. అందరూ ముక్కుమ్మడిగా చేసిన ప్రతిజ్ఞ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Maharashtra College Girls Made To Take Oath Against Love Marriage

దీంతో.. ఓ మీడియా సంస్థ ఈ విషయంపై సదరు అమ్మాయిలను పలకరించింది. దానికి వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెప్పారు. ‘‘ మేము ప్రేమించే అబ్బాయి అందరికీ మంచివాడై ఉండాలి. తన కాళ్లపై తాను నిలపడాలి. ఎవరైనా ప్రేమించాల్సి వస్తే.. ఇంట్లో వాళ్ల సలహా తీసుకోవడం అవసరం’’ అంటూ రితిక అనే విద్యార్థిని తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

మరో యువతి భావన మాట్లాడుతూ ‘‘అసలు ప్రేమ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి..? ఈ విషయం గురించి ఇంట్లో పెద్దవాళ్లు ఆలోచిస్తారు కదా.. మనకు ఏది మంచిదో తల్లిదండ్రులకే సరిగా తెలుస్తుంది’’ అంటూ సెలవిచ్చింది.

ఈ ఘటనపై మహారాష్ట్ర మహిళ శిశు సంరక్షణ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ కూడా మాట్లాడారు. విద్యార్థినులు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదన్నారు. అలాంటి ప్రతిజ్ఞ చేసుకోవాలన్నారు. ఇటీవల మహారాష్ట్రలోని వార్దాలో ఓ ఉపాద్యాయురాలిని ప్రేమ అంగీకరించలేదని.. ఆమె స్నేహితుడే పెట్రోల్ పోసి తగలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను గుర్తుపెట్టుకొని విద్యార్థినులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios