వాళ్లిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాలను ఒప్పించి పెళ్లి కి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. మరి కొన్ని గంటల్లో పెళ్లి అనగా.. కేవలం పెళ్లి కూతురు కట్టుకున్న చీర కారణంగా పెళ్లి ఆగిపోయింది. వధువు కట్టుకున్న చీర కాబోయే అత్తమామలకు నచ్చలేదు. దీంతో.. పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఈ వింత సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం హాసన్ పట్టణానికి చెందిన బీఎన్ రఘు కుమార్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం అదే ప్రాంతానికి చెందిన సంగీత అనే యువతిని ప్రేమించాడు. అదే విషయం ఆమెకు తెలియజేశాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ ఇరుకుటుంబాలకు తమ ప్రేమ విషయాన్ని తెలియజేశారు.

వారు కూడా సంతోషంగా అంగకీరించారు. ఇరువైపులా పెద్దలు కూర్చొని మంచి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. తీరా పెళ్లి తేదీ వచ్చేసింది. వధువు ఎన్నో ఆశలతో అందంగా ముస్తాబై మండపం మీదకు వచ్చేసింది.

Also Read పూల వ్యాపారి జీవితంలో అద్భుతం ... భార్య ఖాతాలో రూ.30కోట్లు...

అందంగా ముస్తాబైన వధువుని చూసి పెళ్లి కొడుకు కుటుంబం ముఖం చిట్టించింది. ఎందుకా అంటే.. వధువు కట్టుకున్న చీర వాళ్లకి నచ్చలేదు. ఆ చీర చూడటానికి చీప్ గా ఉందంట. చీర మార్చుకోమని వధువుని బలవంతం చేశారు.

ఆమె ఆ చీర మార్చుకోవడానికి ససేమిరా అంగీకరించలేదు. దీంతో... గొడవ మొదలైంది.వరుడు కూడా తల్లిదండ్రులు చెప్పిన దానికి తలాడిస్తూ వధువుని చీర మార్చుకోవాలని బలవంత పెట్టాడు. ఆమె మార్చుకోడానికి ఇష్టపడకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ చేశారు.

దీంతో... వధువు తల్లిదండ్రులు.. వరుడు, అతని పేరెంట్స్ పై కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.