Viral Video : కొడుకును బిల్లు కట్టమన్న తండ్రి.. ఆ చిన్నారి రియాక్షన్స్ కు నెటిజన్స్ ఫిదా..
ఇంటర్నెట్ ను ఓ వైరల్ వీడియో షేక్ చేస్తుంది. ఈ ఫన్నీ వీడియోలో ఓ తండ్రీకొడుకుల సంభాషణ నెటిజన్లను ముగ్ధుల్ని చేస్తుంది. ఆ చిన్నారి రియాక్షన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
కుటుంబంలో అందరికంటే చిన్నవాడు అవ్వడం వల్ల అనేక లాభాలుంటాయి. అందరూ ముద్దు చేస్తారు, గారాబం చేస్తారు. ఎంత పెద్దవాడైనా.. చిన్నోడులే అని వదిలేస్తారు. ఇక బాధ్యతల విషయంలోనూ చిన్నవాడు అనే ఆప్షన్తో మొత్తం పెద్దవాళ్లే చూసుకుంటుంటారు. అయితే.. ఇక్కడో చిన్నోడికి అనుకోని సమస్య వచ్చి పడింది. ఆ సమయంలో అతను రియాక్ట్ అయిన తీరే ఈ వైరల్ వీడియో..
ఓ చిన్నారి.. వారి కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ అందరూ ఎంచక్కా భోజనం చేశారు. చిన్నారి కూడా తనకిష్టమైన ఫుడ్ ను హాయిగా లాగించేశాడు. ఆ తరువాత వెయిటర్ బిల్ తీసుకువచ్చాడు. అది చూసిన వాళ్ల నాన్న ఆ బిల్ ను ఆ అబ్బాయికి ఇచ్చాడు. మొదట అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు. అయితే తండ్రి మాత్రం.. ‘ఇప్పుడు నీ టర్న్.. బిల్ నువ్వే కట్టాలి’ అని చెప్పాడు.
అది విన్న బాలుడికి ఏమీ అర్థం కాలేదు. అలా బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు. తండ్రి వెంటనే రెట్టించి.. ‘బిల్లు కట్టాలి, నీ దగ్గర డబ్బులున్నాయి కదా’ అని అడిగాడు. వెంటనే తేరుకున్న ఆ అబ్బాయి. ‘బిల్లు ఇప్పుడు మీరు కట్టండి. ఇంటికి వెళ్లాక నేను డబ్బులిచ్చేస్తా’ అని క్యూట్ గా సమాధానం చెప్పాడు. దీంతో తండ్రి బిగ్గరగా నవ్వేసి తాను జోక్ చేశానని చెబుతూ బిల్ కట్టేశాడు.
రోడ్డుమీది గుంతలోనే స్నానం, యోగా... రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన..
ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. తండ్రి డబ్బులు చెల్లించమన్నప్పుడు ఆ చిన్నారి గందరగోళం, మొహంలో మారిన భావాలు, అర్థం కాక అమాయకంగా చూడడం, డబ్బులు లేవని చెప్పకుండా, ఇంటికి వెళ్లాక ఇస్తామనడం... .. ఇవన్నీ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుండి, 7.4 మిలియన్ల మంది చూశారు. 298వేల లైక్‌లు, వెయ్యికి పైగా కామెంట్స్ వచ్చాయి.
దీనిమీద నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ.. ‘తండ్రి డబ్బులు చెల్లించమనగానే.. ఏం చేయాలా? అని కొడుకు ఆలోచించిన తీరు బాగుంది’ అని ఒకరంటే.. ‘ఇంటికి వెళ్లాక ఇస్తా అనడం’ ఆ చిన్నారిలోని మంచిమనసును చెబుతోంది అన్నారు. మరో నెటిజన్.. నా కొడుకు కూడా తాను దాచుకున్న డబ్బులనుంచి నా బర్త్ డేకు గిఫ్ట్ లు కొంటుంటాడు. పిల్లలు మనం ఏది చేస్తే వాళ్లది నేర్చుకుంటారు. అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. "పిల్లవాడికి హృదయం ఉంది. డబ్బు లేనప్పటికీ అతను ఆ బిల్ తీసుకుని మాట్లాడే విధానం.. మంచి పేరెంటింగ్‌ను సూచిస్తుంది." అని ఒకరు..ఎంత మంచి కుర్రాడు.. ఎంత బాగా ఆలోచించాడు.. అంటూ మరొకరు.. ఇలా కామెంట్ల వరద కొనసాగుతోంది.