తెలుగుదేశం పార్టీ నాయకులు పంచభూతాలను దోచుకున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలన్నారు. బాబు వేల కోట్ల రూపాయల దోచుకున్నారని పార్థసారథి ఆరోపించారు.

వరదల కారణంగా రాష్ట్రంలో కొంత ఇసుక కొరత ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. లక్షా యాభై వేల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామని.. రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ఇసుక జలకు అందుబాటులో ఉంటుందని పార్థసారథి స్పష్టం చేశారు.

Also Read:మీ కళ్లు గద్దలు పొడవా, పౌరుషమున్న ముఖ్యమంత్రివైతే...:జగన్ పై సినీనటి దివ్యవాణి ఫైర్

సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించమంటే చంద్రబాబు పారిపోయారని పార్థసారథి మండిపడ్డారు.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... చంద్రబాబుకి దీక్షలు చేసే అర్హత లేదని నాడు ఇసుక దోపిడీ అడ్డుకున్న అధికారులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారని గుర్తుచేశారు.

చంద్రబాబునాయుడు హయాంలోనే రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగిందని..  బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా కృత్రిమ ఇసుక కొరత సృష్టించారని వసంత మండిపడ్డారు. ఇసుక వెబ్ సైట్ ను హ్యాక్ చేశారని.. ఇది చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనే నడుస్తుందని కృష్ణప్రసాద్ ఆరోపించారు. 

చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని. ఆయనకు మొన్న ప్రజలు ఇచ్చిన ఛార్జిషీట్లో 23 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయని.. వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావని కృష్ణప్రసాద్ జోస్యం చెప్పారు.

దేవినేని ఉమా పెద్ద ఇసుక మాఫియా కింగ్ అని.. చంద్రబాబు దీక్ష చేయడం దెయ్యాలు వేదాలు వల్లంచడమేనని ఎద్దేవా చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబుకు వంద కోట్ల రూపాయలు జరిమానా విధించినా బుద్ధి రాలేదని కృష్ణప్రసాద్ దుయ్యబట్టారు.

Also Read:జగన్ కు పొంచి ఉన్న మరో ముప్పు:కాచుకు కూర్చున్న టీడీపీ, జనసేన

చంద్రబాబు ఇంటి పక్కనే రోజు వందల కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణా జరిగేదని ఆయన ఆరోపించారు. బాబు హయాంలో జరిగిన ఇసుక కుంభకోణాలపై కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయని వసంత కృష్ణప్రసాద్ గుర్తు చేశారు.

పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఇసుక దోపిడీకి పాల్పడిందే తెలుగుదేశం పార్టీ నాయకులన్నారు. తమ పార్టీ నేతలు తప్పు చేస్తే శిక్షించమని జగన్మోహన్ రెడ్డే స్వయంగా చెప్పారని అనిల్ గుర్తుచేశారు. అలాంటి దైర్యం ఎప్పుడైనా చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు.

ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఉచితంగా కట్టబెట్టారు. జగన్ చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా మరో 30 దేశాలు ఆయనే సీఎంగా ఉంటారని కైలా గుర్తుచేశారు. తెలంగాణలో పట్టిన గతే ఏపీలోనూ టీడీపీకి పడుతుందని అనిల్ మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు దొంగదీక్షలను ఆపాలని ఆయన సూచించారు.