అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఇసుక కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ సర్కార్ కు సిమ్మెంట్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది.  

రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో ఇసుక కొరత కాస్త ఆలస్యమైంది. ఆ ఇసుక కొరతను అధిగమించేందుకు జగన్ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. మరో రెండు రోజుల్లో సమస్య ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్న తరుణంలో సిమ్మెంట్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. 

దేశవ్యాప్తంగా సిమ్మెంట్ కంపెనీలు ధరను ఆకస్మాత్తుగా పెంచేశాయి. మరోవైపు ఆర్థిక మాంద్యం ప్రభావంతో కొన్ని కంపెనీలు సిమ్మెంట్ ఉత్పత్తిని తగ్గించేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో సిమ్మెంట్ సరఫరా ఒక్కసారిగా పడిపోయింది. 

రెండు వారాల్లో సీఎం జగన్ రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఇసుక వారోత్సవాలకు సైతం పిలుపు ఇచ్చారు. ఇసుక కొరతతో ఇప్పటి వరకు నిలిచిపోయిన భవన నిర్మాణాల పనులు ఊపందుకునే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. 

ఇలాంటి తరుణంలో సిమ్మెంట్ ధర ఒక్కసారిగా పెరగడం, మరికొన్ని కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేయడంపై వైసీపీలో ఆందోళన నెలకొంది. ఇసుక కొరతతో ఇప్పటికే భవన నిర్మాణాలు నిలిచిపోయాయని తాజాగా సిమ్మెంట్ కొరతతో మరింత మందగించే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. 

ఇకపోతే రాష్ట్రంలో ఇసుక కొరతను ఆసరాగా తీసుకుని విపక్షాలు చేస్తున్న నిరసనలు వైసీపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరులో కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. 

అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం బీజేపీ సైతం ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టగా వామపక్షాలు సైతం అర్థనగ్న ప్రదర్శనలతో నిరసనలు తెలిపింది. 

విప్లవాత్మక నిర్ణయాలు, సంచలన నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్న సీఎం జగన్ కు ఇసుక కొరత అంశం పెద్ద సమస్యగా మారింది. దానిపైనే ప్రత్యేకంగా సమీక్షలు సైతం చేసినా ఎలాంటి ఫలితం రావడం లేదు. సమస్య ఓ కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో సిమ్మెంట్ కొరత అంశం పెను ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు. 

ఈ ప్ర‌మాదం లేకుండా ఉండాలంటే జ‌గ‌న్ సిమెంటు స‌ర‌ఫ‌రా విష‌యంలో ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సిమెంట్ పరిస్థితిని నియంత్రించకపోతే మరో తలనొప్పి ఎదుర్కోక తప్పదు. 

ఇప్పటి వరకు ఇసుక కొరతపై పోరాటం చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వామపక్షాలు తాజాగా సిమెంట్ కొర‌త అంటూ మరోసారి ఉద్యమబాట పట్టే అవకాశం లేకపోలేదు.  ఇకపోతే జ‌గ‌న్‌కు భారతి సిమెంట్స్ కంపెనీలు ఉండ‌టం మరింత రచ్చకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. 

ఇకపోతే ఇప్పటికే మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. సిమ్మెంట్ కంపెనీలు బస్తాకు రూ.5 ఇవ్వలేదని కోపంతోనే జగన్ రాష్ట్ర ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా చేశారంటూ కీలక ఆరోపణలు చేశారు. 

వైసీపీలో చతుష్టయంగా పేర్గాంచిన సజ్జల, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు సిమ్మెంట్ కంపెనీలను డిమాండ్ చేయడం నిజం కాదా అని నిలదీశారు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. ఇసుక కొరతకు ప్రకృతి వైపరీత్యాలే కారణమని చెప్పి తప్పించుకున్న సీఎం జగన్ కు సిమ్మెంట్ కొరతను కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ ప్రభుత్వం ఇసుకను కూడా కబ్జా చేస్తోంది.. దీక్షలో చంద్రబాబు

ఇసుక కొరత: పవన్ కల్యాణ్ పై ఎదురుదాడి, వాస్తవాలు ఇవీ