రోజా అక్క... మీ ఎంపీని ఏం చేయమంటావ్...?: వర్ల రామయ్య
మహిళల రక్షణ గురించి ఎప్పుడూ సీఎం జగన్ ముందుంటాడని గొప్పగా చెప్పిన ఎమ్మెల్యే రోజా ఇప్పుడు అమరావతి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఎంపీ నందిగం సురేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య నిలదీశారు.
అమరావతి: ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే గన్ను కంటే ముందు జగనన్న వస్తాడని చెప్పిన వైసిపి ఎమ్మెల్యే రోజా అక్క అమరావతి మహిళల విషయంలో జరిగిన దారుణానికి ఏం సమాధానం చెబుతుందని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఎక్కడా అమలుకాని చట్టాన్ని అమలుచేస్తున్నట్లు నటిస్తూ హడావిడిగా దిశచట్టం తీసుకొచ్చిన ప్రభుత్వానికి నిజంగా దమ్ము, ధైర్యముంటే ఎంపీ సురేశ్, అతని అనుచరులపై అదే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్ చేశారు.
తానొక ఎంపీననే విషయం మర్చిపోయి పదవి ఉందికదా, ప్రభుత్వ వాహనాలు ఇచ్చింది కదా అని వాటితో అడ్డొచ్చినవారిని గుద్దుకుంటూ వెళ్లడం ఏమిటని... తన వాహనం ఢీకొని గాయపడిన రైతుకి ఏదైనా జరగరానిది జరిగితే ఎంపీ బాధ్యత వహించేవాడా అని రామయ్య ప్రశ్నించారు. అయినదానికి, కానీదానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వాడుకుంటున్న సురేశ్ నైజాన్ని చూసి ఆయనకు ఓట్లేసినవారితో పాటు సాధారణ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురువుతున్నారని వర్ల పేర్కొన్నారు.
ఎంపీ సురేశ్ లాంటి వ్యక్తులు, విలువైన చట్టాలను దుర్వినియోగం చేస్తుండబట్టే ఆ చట్టాన్ని పునసమీక్షించాలనే డిమాండ్లు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయన్నారు. ఎంపీ ఇప్పటికైనా తన దుందుడుకు విధానాలకు స్వస్తిచెప్పి బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో మెలగాలని వర్ల సూచించారు.
read more విజయనగరంలో మరో దిశ పోలీస్ స్టేషన్... ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)
అమరావతి జేఏసీ మహిళలపట్ల అమానుషంగా ప్రవర్తించిన సురేశ్ సదరు మహిళలకు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని సూచించారు. మహిళలను నిర్బంధించి, వారిపట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన ఎంపీపై, అతని అనుచరులపై ఎలాంటి కేసులు పెడుతున్నారో, ఎప్పుడు వారిని అరెస్ట్ చేస్తున్నారో డీజీపీ చెప్పాలని రామయ్య నిలదీశారు.
సురేశ్ ఎందుకు అంతలా కంగారుపడుతున్నారో, ఏం చేస్తున్నాననే ఆలోచన లేకుండా విపరీత స్వభావంతో ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆయనే చెప్పాలన్నారు. సురేశ్ దళితబాణంగా మారి జగన్ చెప్పిందల్లా ఎందుకు చేస్తున్నాడో, ఆయనే చెబితే బాగుంటుందన్నారు.
read more భవిష్యత్ లో భారీ దాడులు... ఇదే నిదర్శనం...: వైసిపి ఎమ్మెల్యే ఆందోళన
మహిళలను నిర్బంధించి చెప్పలేనివిధంగా దూషించి, వారిని మానసిక క్షోభకు గురిచేసి, ఒక మహిళ పట్ల అత్యంతహేయంగా ప్రవర్తించిన సురేశ్ ను ఏం చేస్తున్నారో, ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. దిశాచట్టాన్ని ఎంపీకి, అతని బృందానికి వర్తింపచేయాలని రామయ్య డిమాండ్ చేశారు.