గుంటూరు: రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని చెప్పడానికి అనేక కారణాలున్నాయని... వాటిలో ప్రధానంగా విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన, సీతానగరంలో నారా లోకేశ్ పై జరిగిన దాడి సంఘటనలున్నాయని... ఇంత జరిగినా రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నాడని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిలదీశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

ముఖ్యమంత్రి జగన్ ని ప్రశ్నించినా పెద్దగా ఉపయోగంలేదని... ఆయనకు తన స్వలాభం తప్ప ప్రజల సమస్యలు పట్టడంలేదు కాబట్టి తాము డీజీపీని ప్రశ్నిస్తున్నామన్నారు. చంద్రబాబు, లోకేశ్ లపై జరిగిన దాడి సంఘటనలు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత కుటుంబాన్నిఅంతం చేయడానికి కుట్ర పన్నినట్లుగా అనిపిస్తోందన్నారు.  తండ్రీ కొడుకులను లేకుండా చేస్తే రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండదన్న దుర్మార్గపు ఆలోచనతో...జగన్ ఆదేశాల ప్రకారమే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని వెంకన్న ధ్వజమెత్తారు. 

నారా లోకేశ్ ప్రజాచైతన్య యాత్ర ముగించుకొని తిరిగివస్తున్న సమయంలో దాదాపు 1000మంది వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి యత్నించారన్నారు. కలియుగ అభిమన్యుడైన లోకేశ్ పై వెయ్యిమంది ఒక్కసారిగా రాక్షసుల మాదిరి దాడిచేశారన్నారు. పురాణాల్లో పురుషోత్తములు, మహానుభావులపై రాక్షసులు దాడిచేసినట్లుగానే వైసీపీకి చెందిన నరరూప రాక్షసులు లోకేశ్ పైకి దూసుకొచ్చారని వెంకన్న తెలిపారు. 

తాము తలుచుకుంటే లోకేశ్ ని తన్ని పంపించేవాళ్లమని చెబుతున్న జక్కంపూడి రాజా పోలీసులు లేకుండా జనం మధ్యలోకి వస్తే ఎవరు ఎవరిని తంతారో తేలుతుందన్నారు. రాజా ఎక్కడకు వస్తాడో చెబితే తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని... టీడీపీ శక్తి ఏమిటో రాజాకు తెలియచేస్తామని  బుద్దా సవాల్ విసిరారు. బరితెగించిన వైసీపీనేతలు మీడియాపై కూడా దాడికి పాల్పడుతూ, తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. 

read more  అందుకోసం ఆర్డినెన్స్... తిరస్కరించాలని గవర్నర్‌ను కోరాం: అచ్చెన్నాయుడు

వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని, దాడులు, కక్షసాధింపులతో ఏమీ సాధించలేమని తెలుసుకుంటే మంచిదన్నారు. టీడీపీ అధినేత ఆదేశాలు, సూచనలతోనే తమపార్టీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని... ఆయనను ఖాతరు చేయకుండా వారంతా బరిలోకి దిగితే వైసీపీ కార్యకర్తలెవరూ కనుచూపుమేరల్లో కనిపించరని వెంకన్న హెచ్చరించారు.  రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే డీజీపీ స్పందించడంలేదని, లోకేశ్ భద్రతను తగ్గించడం వెనకున్న ప్రభుత్వకుట్రలో పోలీసులు భాగస్వాములు కాకుండా ఉండాలన్నారు. 

మంగళగిరి ఎమ్మెల్యేకు రైతుల నుంచి ప్రమాదం ఉందంటూ 4+4 భద్రత కల్పించిన ప్రభుత్వం ఆయన ఇంటివద్ద కూడా భారీగా పోలీసులను మోహరించిందని, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ మంత్రికి మాత్రం భద్రతను తగ్గించడం కుట్రకాదా అని బుద్దా నిలదీశారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబునాయడు సహా  ఆయన కుటుంబసభ్యుల భద్రతతో ఆడుకుంటున్న వైనంపై ‌కేంద్రహోంశాఖకు లేఖ రాస్తామని ఎమ్మెల్సీ స్పష్టంచేశారు. కేవలం వారంవ్యవధిలోనే చంద్రబాబుపై, లోకేశ్ పై దాడి జరిగిన విధానంపై తక్షణమే కేంద్ర  ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు. 

read more  జగన్ ప్రభుత్వ శాడిజం... చీప్ లిక్కర్ కోసం ప్రపంచ బ్యాంకుకా...?: అనిత ఫైర్

జగన్ ప్రభుత్వం సాధిస్తున్న కక్షసాధింపుల్లో భాగంగానే వారిపై దాడి జరిగిందని... వారిని అంతంచేయాలన్న ఆలోచనతోనే ఇటువంటి చర్యలకు పాల్పడిందన్నారు. జగన్ నాయకత్వంలో, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తమపబ్బం గడుపుకోవాలన్న ఆలోచనల్లో ఉన్నారన్నారు. చంద్రబాబుకి, లోకేశ్ కు భద్రత తగ్గించగలిగిన ప్రభుత్వం, ప్రజల్లో వారిపట్ల రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణను ఎలా తగ్గిస్తుందో చూస్తామన్నారు.