అమరావతి:  వైఎస్సార్ కాంగ్రెస్ నేతల తీరుచూస్తే కరోనా వైరస్ కూడా భయపడేలా ఉందని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. మద్యం బకాయిల కోసం ప్రపంచబ్యాంకు రుణం తీసుకుంటామంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించడం వైసీపీ తప్పుడు విధానాలకు పరాకాష్టగా అనిత పేర్కొన్నారు. 

ఏపి ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రకటన దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. దశలవారీగా మద్యపాన నిషేదం అంటే మద్యం బకాయిల కోసం దశలవారీగా ప్రపంచబ్యాంక్ రుణం తీసుకోవడమా? అని నిలదీశారు. వరల్డ్ బ్యాంకు రుణాలు తీసుకుని మద్యం విక్రయాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. 

టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన ప్రజా కార్యక్రమాలను నిలిపివేసి అభివృద్ధిని అటకెక్కించి ప్రజలను సమస్యల వలయంలో నెట్టారని అన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలు ఒక్కొక్కటిగా పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయని... ఇందుకు ప్రభుత్వ  దౌర్జన్యపు విధానాలే కారణమన్నారు. 

కమీషన్లు ఇచ్చే మద్యం బ్రాండ్లను ఏపిలో అమ్మకాలు చేపట్టేందుకు అనుమతిస్తూ తుగ్లక్ ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తున్నారని విరుచుకుడ్డారు. చీప్ లిక్కర్ కోసం ప్రపంచబ్యాంకు రుణం తీసుకుంటామని చెప్పడం వైసీపీ శాడిజానికి నిదర్శనమని అనిత విమర్శించారు. రాష్ట్ర పరువును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చేలా జగన్ అండ్ బ్యాచ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

read more  ముగిసిన క్యాబినెట్ భేటీ : స్థానిక ఎన్నికల్లో తేడా వస్తే ఇక అంతే...

''రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు, సంక్షేమ కార్యక్రమాల కోసం, పోలవరం లాంటి ప్రాజెక్టులను నిర్మించేందుకు ఎవరైనా ప్రపంచబ్యాంకు రుణం కోరతారు. రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యంపై జే-ట్యాక్స్ కోసం ప్రపంచ బ్యాంకు రుణం కోసం అర్రులు చాస్తున్నారు. మద్యం విక్రయాల్లో ఇప్పటికే నెలకు రూ.300 కోట్లు జగన్ జేబులోకి వెళ్తున్నాయి. పెద్ద కంపెనీలు కమీషన్లు ఇవ్వకపోవడంతో ముడుపులు ఇచ్చే బ్రాండ్లు తీసుకువచ్చారు'' అని ఆరోపించారు. 

''దశలవారీ మద్యం నిషేధం పేరుతో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల్లో డిస్టలరీల్లో ప్రజల ఆరోగ్యానికి హానిచేసే మద్యం బ్రాండ్లు తామే తయారుచేయించి రాష్ట్రంపై వదులుతున్నారు. ఇందుకోసం ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకుని డిస్టలరీలకు చెల్లించే నెపంతో తమ జేబుల్లో వేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారు'' అని ఆరోపించారు.

read more  ఎన్‌పీఆర్‌లో మార్పులు కోరుతూ తీర్మానం: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

''రాష్ట్ర ప్రజలను మద్యం మత్తులో నింపేందుకు ప్రపంచబ్యాంకు రుణం కోరిన తుగ్లక్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్ విధానాలను నిరసించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలందరూ వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలి'' అని అనిత సూచించారు.