ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తలదించుకునేలా ముఖ్యమంత్రి జగన్ తీరుఉందని, సుప్రీం తీర్పు ద్వారానైనా ఆయన తన పరిదులేమిటో తెలుసుకుంటే మంచిదని టీడీపీనేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హితవుపలికారు. కనీస అవగాహనలేని ఇటువంటి వ్యక్తినా మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకుందని రాష్ట్ర ప్రజలంతా అవమానంతో తలదించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 

ప్రజల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి బుద్ధి హీనతతో ప్రవర్తిసున్నాడన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కరోనా ప్రభావంతో వణికిపోతుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో దాన్ని నయం చేయవచ్చని చెబుతున్నాడని...ఆయన వైఖరిచూశాక ప్రజలంతా ఇతనికా మేం ఓటేసింది అంటూ తలలు బాదుకుంటున్నారన్నారు. 

read more  కరోనా తెచ్చిన కష్టాలు... పరువు పోయిందంటూ ఓ కుటుంబం ఆవేదన

కరోనా కారణంగా వ్యాపారరంగం సుడిగుండంలో పడిపోయిదని... రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. రాష్ట్రప్రజల ఆరోగ్యాన్ని పణంగాపెట్టి, ఎన్నికలద్వారా తన పబ్బం గడుపుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మేధావుల సలహాలు తీసుకొని, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని రామ్మోహన్ రావు హితవు  పలికారు. 

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈసీ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. తెలుగుదేశం పార్టీ తరపున చీఫ్ ఎలక్షన్ కమీషన్ ను కలిసి వాస్తవాలు వివరిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారన్న ఆయన ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఖరి మారాలని సూచించారు.

read more  స్థానికసంస్థలపై సుప్రీం తీర్పు... మంచి పరిణామమే: వెల్లంపల్లి శ్రీనివాస్

 ఎన్నికల కోడ్ సడలించడాన్ని కూడా తాము స్వాగతిస్తున్నామన్నారు. ఎస్ఈసీకి కులాన్ని ఆపాదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరికి కులం ఆపాదిస్తారని నిలదీశారు. కరోనా వైరస్ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కరోనా వైరస్ నియంత్రణపై దృష్టి పెట్టాలని.. దేశం మొత్తం  కరోనా వైరస్ గురించి భయపడుతుంటే ముఖ్యమంత్రికి పట్టడం లేదా అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.